Sanjay Dutt: The Crazy Untold Story of Bollywood's Bad Boy: తల్లి మరణాన్ని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన బాలీవుడ్ నటుడు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-a7851a7e1eca95b3615495bacdc5af967ab42a6e.jpg)
- నాలుగు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్న మున్నాభాయ్
- అమెరికాలో చికిత్స తీసుకుంటున్నప్పుడు తల్లి నర్గీస్ టేపులకు చలించిపోయిన వైనం
- 'సంజయ్ దత్ : ది క్రేజీ అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్స్ బ్యాడ్ బాయ్' పుస్తకంలో రచయిత ఉస్మాన్ వెల్లడి
బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు. తన తల్లి నర్గీస్ మరణించిన మూడేళ్లకు ఆయన ఆ విషాదాన్ని తలుచుకుని వరుసగా నాలుగు రోజుల పాటు బోరున విలపించినట్లు ఈ బాలీవుడ్ నటుడి జీవితంపై రాసిన పుస్తకంలో రచయిత యాసర్ ఉస్మాన్ పేర్కొన్నారు. సంజయ్ దత్ తల్లి నర్గీస్ మే3, 1981న మరణించారు. ఆయన జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల గురించి ఉస్మాన్ రాసిన ఈ పుస్తకాన్ని జుగ్గర్‌నాట్ సంస్థ ముద్రించింది.
"సంజయ్ తన తల్లి మరణించినప్పుడు ఏడవలేదు. కానీ, ఆమె మరణించిన మూడేళ్ల తర్వాత ఆయన చిన్న పిల్లాడిలా ఏడ్చారు. ఆ విషాద స్మృతుల నుంచి ఆయన ఇప్పటికీ కోలుకోలేదు" అని రచయిత చెప్పుకొచ్చారు. "నాకు దు:ఖం ఆగలేదు. ఏడ్చాను. ఏడ్చాను. నాలుగు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నాను. ఆమె చనిపోయిన తర్వాత ఆమె కోసం నేను అప్పటిదాకా విచారపడలేదని నాకు ఆ క్షణం అర్థమయింది. అందువల్ల ఆమె గొంతు, ఆమె తాలూకూ టేపులు నా జీవితంలో మార్పును తీసుకొచ్చాయి" అని సంజయ్ చెప్పినట్లు రచయిత ఉటంకించారు.
సంజయ్ దత్ అమెరికాలోని మాదకద్రవ్యాల పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్న రోజుల్లో తాను త్వరగా కోలుకునేందుకు తల్లి నర్గీస్‌కు సంబంధించిన కొన్ని టేపులను తన తండ్రి సునీల్ దత్ ఆయనకు పంపారు. 'సంజయ్ దత్ : ది క్రేజీ అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్స్ బ్యాడ్ బాయ్' పేరుతో రాసిన ఈ పుస్తకంలో దత్ జీవితంలోని ఎత్తుపళ్లాల గురించి ప్రస్తావించనట్లు రచయిత తెలిపారు.