MS Dhoni: మర్రి చెట్టు వంటి ధోనీ నీడలో ఎదగలేకపోయిన దినేష్ కార్తీక్!
- కీపర్ గా పాతుకుపోయిన ధోనీ
- బెంచ్ కే పరిమితమవుతూ వచ్చిన దినేష్
- 14 ఏళ్ల క్రితమే జట్టులోకి వచ్చినా ఆడింది తక్కువే
- నిన్నటి మ్యాచ్ లో సూపర్బ్ ఇన్నింగ్స్
- వెల్లువెత్తుతున్న పొగడ్తలు
దినేష్ కార్తీక్... సౌమ్యా సర్కార్ వేసిన ఆఖరి బంతిని బౌండరీ దాటించి, ఇండియా చేతికి మరో ట్రోఫీని అందించిన క్రికెటర్. అంతేకాదు, 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన సంక్లిష్ట స్థితిలో 8 బంతుల్లోనే 29 పరుగులు సాధించిన వీరుడు. ఇప్పుడు కార్తీక్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సచిన్, గంగూలీ వంటి వారెందరో కార్తీక్ ఆటతీరును ప్రశంసలతో ముంచెత్తారు. కోహ్లీ, ధోనీ, భుమ్రా, భువనేశ్వర్ వంటి వారు లేకుండా కూడా భారత్ ఓ ట్రోఫీని గెలిచిందంటే, అది బెంచ్ పై ఉన్న కుర్రాళ్ల సత్తా చాటుతున్నట్టే.
ఇక దినేష్ కార్తీక్ 2004లో అంతర్జాతీయ క్రికెట్ లోకి రంగ ప్రవేశం చేయగా, ఈ 14 సంవత్సరాల్లో కేవలం 23 టెస్టులు మాత్రమే ఆడాడు. 79 వన్డేలు, 18 టీ-20లు ఆడాడు. అంటే ఏడాదిలో రెండు టెస్టులు, రెండు టీ-20లు ఆడే అవకాశం కూడా దినేష్ కు దక్కలేదు. ఏడాదిలో సగటున ఓ ఐదారు వన్డే మ్యాచ్ లలోనే దినేష్ ఆడాడు. స్పెషలిస్టు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ హోదా ఉన్న దినేష్ కార్తీక్, దాదాపు ప్రతి టోర్నమెంట్ కూ ఎంపికవుతాడు. కానీ తుది 11 మందిలో మాత్రం ఉండడు. కేవలం బెంచ్ కి మాత్రమే పరిమితం అవుతాడు.
మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపర్ గా పాతుకుపోయి ఉంటే, ఇక దినేష్ వంటి వారికి అవకాశం ఎందుకు లభిస్తుంది? ధోనీలాంటి మర్రిచెట్టు నీడలో దినేష్ కు అవకాశాలు రాలేదన్నది అంగీకరించాల్సిన వాస్తవమే. ఈ 14 సంవత్సరాల్లో ధోనీ గాయపడ్డప్పుడో లేదా విశ్రాంతి తీసుకున్నప్పుడో మాత్రమే దినేష్ కు మ్యాచ్ ఆడే అవకాశం లభించిందనడంలో సందేహం లేదు. జట్టులో స్థానం పొందుతూ అత్యధిక మ్యాచ్ లలో బెంచ్ కి మాత్రమే పరిమితమైన ఆటగాడు కూడా దినేష్ కార్తీకే. సీనియర్ల గైర్హాజరుతో లంకలో సిరీస్ ఆడే అవకాశాన్ని అందిపుచ్చుకున్న దినేష్, వికెట్ల వెనుక మాత్రమే కాకుండా, వికెట్ల ముందు కూడా తన సత్తా చాటి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అన్నట్టు... ఓ టీ-20 మ్యాచ్ లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన తొలి భారత ఆటగాడు కూడా దినేషే.