Congress: బీజేపీ జాతీయాధ్యక్షుడు ఓ హత్య కేసులో నిందితుడు: నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
- కౌరవుల్లా ఆర్ఎస్‌ఎస్, బీజేపీ అధికారం కోసం యుద్ధం చేస్తున్నాయి
- పాండవుల్లా కాంగ్రెస్ పార్టీ సత్యం కోసం పోరాటం చేస్తోంది
- దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఓ హత్య కేసులో నిందితుడంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో రెండో రోజు కొనసాగుతోన్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ... కౌరవుల్లా ఆర్ఎస్‌ఎస్, బీజేపీ అధికారం కోసం మాత్రమే యుద్ధం చేస్తున్నాయని, పాండవుల్లా కాంగ్రెస్ పార్టీ సత్యం కోసం పోరాటం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లా ప్రవర్తించలేదని అన్నారు.
దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీపై ఎన్నో ఆశలు పెట్టుకుందని, బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ కి గళమైతే కాంగ్రెస్ పార్టీ జాతికి గళమని రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అంచనాలకు అనుగుణంగా పని చేయడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతోందని ప్రశ్నించారు. అన్ని వస్తువులనూ చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారని, అన్నింటిపైనా మేడిన్ చైనా అనే కనపడుతోందని విమర్శించారు.
మనది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థ అని, దాన్ని నాశనం చేస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. 33 వేల కోట్ల రూపాయలను దోచుకున్న వారిని బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. బీజేపీ అన్నింటినీ రాజకీయ దృష్టి కోణంలోనే ఆలోచిస్తోందని చెప్పారు. గుజరాత్ ఎన్నికల సమయంలో తాను గుడికి వెళితే కూడా రాజకీయం చేశారని రాహుల్ గాంధీ విమర్శించారు.