siddu: వచ్చే ఏడాది రాహుల్ గాంధీ ఎర్రకోటపై జెండా ఎగురవేయాలి: నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ
- ఢిల్లీలో రెండో రోజు కొనసాగుతోన్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం
- ఉద్వేగపూరితంగా ప్రసంగించిన సిద్ధూ
- ఎన్డీఏ ప్రభుత్వం నిరుపేదల కష్టాన్ని దోచుకుంటోంది
- కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడడం నా ధర్మం
వచ్చే ఏడాది తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయాలని పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. అందుకు తామంతా కృషి చేస్తామని చెప్పారు. ఢిల్లీలో రెండో రోజు కొనసాగుతోన్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సిద్ధూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మౌనం దేశంలో ఎలాంటి గొడవలూ చెలరేగకుండా చేసిందని, ఇప్పటి మోదీ ప్రభుత్వంలో మాత్రం గొడవలు చెలరేగుతున్నాయని ఆయన అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం నిరుపేదల కష్టాన్ని దోచుకుంటోందని నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజల ప్రక్షాన నిలబడుతోందని వ్యాఖ్యానించారు. తన తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారని, కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడడం తన ధర్మమని అన్నారు. కాగా, అనంతరం ఏఐసీసీ ప్లీనరీలో విదేశీ విధాన తీర్మానానికి ఆమోదం తెలిపి, దానిపై ప్రసంగిస్తున్నారు.