Vietnam: త్వరలో భారత్‌కూ 'బికినీ' ఎయిర్‌లైన్స్ విమాన సేవలు!
- ఈ ఏడాది జులై-ఆగస్టు మధ్యకాలంలో భారత్‌లో కార్యకలాపాల ప్రారంభం
- న్యూఢిల్లీ నుంచి హోచిమిన్ నగరానికి నేరుగా విమానాలు
- బికినీలు, స్విమ్‌సూట్‌లతో వియట్ జెట్ ఎయిర్‌హోస్టెస్‌ల సేవలు
- బికినీ కాన్సెప్ట్‌కు భారత్‌లో వ్యతిరేకత తప్పదని పరిశీలకుల అభిప్రాయం
వియత్నాంకి చెందిన చౌకధరల విమానయాన సంస్థ 'వియట్‌జెట్ ఎయిర్' త్వరలోనే భారత్‌లోనూ కార్యకలాపాలను మొదలుపెట్టనుంది. ఈ ఏడాది జులై-ఆగస్టు మధ్యకాలంలో భారత్‌లో వియట్ జెట్ తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశముంది. ఈ విమానయాన సంస్థకు అధినేత ఓ మహిళ. ఆమె పేరు ఎన్‌గుయెన్ థి ఫుయాంగ్ థావో. ఈ ఎయిర్‌లైన్స్ సంస్థ 'బికినీ' ఎయిర్‌లైన్‌గా సుపరిచితం. పేరుకు తగ్గట్టుగానే ఈ కంపెనీ విమానాల్లో పనిచేసే ఎయిర్‌హోస్టెస్‌లు ఇతర విమానయాన సంస్థల ఎయిర్‌హోస్టెస్‌లకు భిన్నంగా బికినీలు, స్విమ్ సూట్‌లు ధరిస్తారు.
ఎయిర్‌హోస్టెస్‌ల అసాధారణ యూనిఫాం కారణంగా వియట్ జెట్ ఎయిర్ కార్యకలాపాలను ప్రారంభించిన అనతికాలంలోనే విపరీతమైన ఆదరణను చూరగొంది. ఈ కంపెనీ అధినేత ఎన్‌గుయెన్ వియత్నాంలో మొట్టమొదటి మహిళా కోటీశ్వరురాలిగా అవతరించారంటే దీనికి లభించిన ఆదరణ ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ నుంచి హోచిమిన్ నగరానికి నేరుగా విమాన సర్వీసులను నడుపుతామని కంపెనీ ప్రకటించింది. ఈ విమానాలు వారంలో నాలుగు సార్లు సేవలందిస్తాయి. ఇదిలా ఉంటే, ప్రపంచంలోని కొన్ని దేశాలు వియట్ జెట్ ఎయిర్ 'బికినీ' ఎయిర్‌హోస్టెస్‌ల కాన్సెప్ట్‌ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సంప్రదాయక దేశమైన భారత్‌లోనూ అలాంటి అనుభవమే కంపెనీకి ఎదురుకావొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.