Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత... బిర్సాముండా జైలు నుంచి హుటాహుటిన రిమ్స్ కు తరలింపు
- చికిత్సను అందిస్తున్న కార్డియాలజీ వైద్యులు
- చూసేందుకు ఎవరినీ అనుమతించని పోలీసులు
- తండ్రి ఆరోగ్యంపై తేజ్ ప్రతాప్ వాకబు
పశుదాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి, ప్రస్తుతం బిర్సాముండా జైలులో శిక్షను అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఆయన్ను జైలు అధికారులు హుటాహుటిన రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కార్డియాలజీ వైద్యులు చికిత్సను అందిస్తున్నట్టు తెలుస్తోంది.
లాలూ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటివరకూ డాక్టర్ల నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. ఇదిలావుండగా, తండ్రి అనారోగ్యం గురించి తెలుసుకున్న తేజ్ ప్రతాప్ పట్నా నుంచి రాంచీకి వచ్చి, ఆరోగ్యం గురించి వాకబు చేశారు. మరోవైపు వందలాది మంది కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకోగా, భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. లాలూను చూసేందుకు ఎవరికీ అనుమతి లేదని అధికారులు స్పష్టం చేయడంతో పలువురు ఆర్జేడీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకు లాలూ అనారోగ్యం గురించి కనీస సమాచారం అందించలేదని జార్ఖండ్ ఆర్జేడీ అధ్యక్షురాలు అన్నపూర్ణా దేవి విమర్శించారు. మీడియాలో వచ్చిన వార్తలు చూసే ఇక్కడికి వచ్చామని, తమ నేతను చూసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.