India: అందుకే, నేను అప్పట్లో కాంగ్రెస్ అధినేత్రిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది: సోనియా గాంధీ
- ఢిల్లీలో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ ప్రసంగం
- కాంగ్రెస్ పార్టీ క్షీణిస్తోన్న దశలో బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది
- ఐకమత్యంగా ఉండడం వల్లే 10 ఏళ్లు అధికారంలో ఉండగలిగాం
- అవినీతి రహిత భారత్ కోసం కృషి చేద్దాం
తమ పార్టీ ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటోన్న సమయంలో రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారని, ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఈ రోజు ఢిల్లీలో జరుగుతోన్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ.. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ క్షీణిస్తోన్న దశలో తాను పార్టీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చిందని అన్నారు. పార్టీనేతలందరి సహకారంతో మళ్లీ పార్టీకి నవజీవం తీసుకువచ్చామని అన్నారు. పార్టీనేతలందరూ ఐకమత్యంగా ఉండడం వల్లే 10 ఏళ్లు అధికారంలో ఉండగలిగామని పేర్కొన్నారు. 2004లో మన్మోహన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.
అందుకే తాము 2009లో మళ్లీ అధికారంలోకి వచ్చామని సోనియా గాంధీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నేతలు చేస్తోన్న అవినీతిని తాము సాక్ష్యాధారాలతో పాటు బయటపెడుతున్నామని వ్యాఖ్యానించారు. దేశంలో ఏయే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదో ఆయా ప్రాంతాల్లో చెలరేగుతోన్న హింసకు వ్యతిరేకంగా తమ పార్టీ నేతలు, కార్యకర్తలు పోరాడుతున్నారని అన్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్‌ని అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దడానికి కృషి చేద్దామని అన్నారు. త్వరలో కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీయే విజయం సాధిస్తుందని అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ మాత్రమే నెరవేరుస్తుందని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.