Rape attempt: భర్త రేప్ చేశాడంటూ గృహిణి ఫిర్యాదు...కంగుతిన్న పోలీసులు!
- పెళ్లయిన నాలుగేళ్లకు గొడవలతో విడిగా ఉంటున్న దంపతులు
- వేరే స్త్రీతో భర్త సంబంధం తెలిసి నిలదీసిన భార్య
- లక్ష తెస్తే సంసారం చేస్తానన్న భర్త..బలవంతంగా తనను రేప్ చేశాడంటూ భార్య ఫిర్యాదు
బెంగళూరుకు చెందిన 28 ఏళ్ల గృహిణి తన భర్త తనపై అత్యాచారం చేశాడంటూ నగరంలోని బసవేశ్వర నగర స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వివరాల్లోకెళితే....సదరు మహిళకు తొమ్మిదేళ్ల కిందట దేవ్‌కుమార్‌తో పెళ్లయింది. అయితే వారికి సంతానం లేదు. పెళ్లయిన నాలుగేళ్లకు పలు కారణాలతో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో భార్య తనకు సంసారం పరంగా అనుకూలంగా లేదంటూ అతను మరో స్త్రీతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అతన్ని నిలదీసింది. పుట్టింటి నుంచి లక్ష రూపాయలు తీసుకొస్తే సంసారం చేస్తానని ఆమెతో అన్నాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఓ రోజు తనకు ఇష్టం లేకుండానే తన భర్త తనను బలవంతంగా లొంగదీసుకుని తనపై అత్యాచారం చేశాడని సదరు మహిళ ఆరోపించింది. ఆమె చెప్పిన వివరాలను పూర్తిగా విన్న పోలీసులకు తొలుత ఏం చేయాలో పాలుపోలేదు. తర్వాత భార్యాభర్తలిద్దరికి నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలని వారు నిర్ణయించడంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది.