Uttar Pradesh: యూపీలో మరిన్ని స్థానాలపై ఎస్పీ, బీఎస్పీ గురి... తాజా ప్రయోగం కొనసాగింపుతో బీజేపీకి చెక్

  • కైరానా లోక్ సభ స్థానం, నూర్పూర్ అసెంబ్లీ స్థానాల్లో త్వరలో ఉప ఎన్నికలు
  • బీజేపీ నేతల మరణంతో ఖాళీ అయిన స్థానాలు
  • ఇక్కడ కూడా పరస్పర సహకారంతో గెలిచే యోచన

సమాజ్ వాదీ, బీఎస్పీ పార్టీలు తమ పరస్పర సహకార బంధాన్ని కొనసాగించడం  ద్వారా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రాబల్యానికి చెక్ పెట్టే వ్యూహంతో ఉన్నాయి. ఇటీవలే జరిగిన గోరక్ పూర్, ఫూల్పూర్ లోక్ సభ స్థానాల్లో బీఎస్పీ మద్దతు పలకడంతో బీజేపీ కంచుకోటలను బద్దలుకొట్టి ఎస్పీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే ప్రయోగాన్ని త్వరలో జరిగే ఇతర ఉప ఎన్నికల్లోనూ కొనసాగించాలని ఇరు పార్టీల అగ్రనేతలు భావిస్తున్నారు.

యూపీలో కైరానా లోక్ సభ స్థానం, నూర్పూర్ అసెంబ్లీ స్థానానికి రానున్న ఐదు నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ రెండూ కూడా బీజేపీకి సిట్టింగ్ స్థానాలు. బీజేపీ ఎంపీ హుకుంసింగ్, ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ మరణంతో ఖాళీ అయ్యాయి. ఇక్కడ కూడా పరస్పర సహకారంతో గెలవాలనే యోచన ఉన్నట్టు బీఎస్పీ, ఎస్పీ వర్గాలు తెలిపాయి. తద్వారా 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకీ చెక్ పెట్టాలన్నది యోచన. ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదన్నది బీఎస్పీ అధినేత్రి మాయావతి సంప్రదాయం. అందుకే గోరక్ పూర్, ఫూల్పూర్ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టకుండా ఎస్పీకి మద్దతు ప్రకటించారు. అలాగే, కైరానా, నూర్పూర్ లోనూ అభ్యర్థులను పోటీకి దింపే ఆలోచన ఆమెకు లేదని పార్టీ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News