Pawan Kalyan: హేట్సాఫ్ టూ పవన్ .. ఆయనకు అంత పవర్ ఉందని నమ్ముతా : తమ్మారెడ్డి భరద్వాజ
- జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ బాగా మాట్లాడారు
- చెప్పిన మాట మీదే పవన్ నిలబడితే ‘హోదా’ రావడం ఖాయం
- ఏపీకి, తెలంగాణకు కావాల్సిన మంచి పనులు చేస్తారని నమ్ముతున్నా : తమ్మారెడ్డి భరద్వాజ
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా బాగా మాట్లాడారని, ఆయన చెప్పిన మాటపై నిలబడి పోరాడితే ఏపీకి ప్రత్యేకహోదా రావడం ఖాయమని ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘నా ఆలోచన’లో ఆయన మాట్లాడుతూ, ‘నా లాంటి వాళ్లో, చలసాని శ్రీనివాస్ లేదా కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన వాళ్లో మాట్లాడుతుంటే మీడియా పెద్దగా పట్టించుకునేది కాదు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే, చచ్చినట్టు మీడియా లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చింది.
ఏపీలో అవినీతి బాగా పెరిగిపోయిందని, ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని, అవసరమైతే, ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని పవన్ అంటే ఈరోజున చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ప్రజల దృష్టి, మీడియా దృష్టి మారింది. ‘మీరు మాట్లాడితే పని జరుగుతుంది. అప్పుడప్పుడు ‘ట్విట్టర్’ లో స్టేట్ మెంట్లు ఇవ్వడం కాదు’ అని పవన్ కల్యాణ్ కు నేను మొదటి నుంచి చెప్పాను, ఇంతకాలానికి పవన్ మాట్లాడారు. చాలా బాగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ చెప్పిన మాట మీదే ఉండి, చెప్పినట్టుగా చేస్తే ప్రత్యేక హోదా రావడం ఖాయం. ఏ పార్టీలో ఉన్న దొంగలైనా లేకుండా పోతారు. ఏపీలో మంచి పరిణామం సంభవిస్తుందని నేను నమ్ముతున్నాను. హేట్సాఫ్ టూ పవన్ కల్యాణ్.. నిన్నటి వరకే. ఎందుకంటే, అంతకుముందు, పవన్ కల్యాణ్ ని నేను కాదన్నాను. పవన్ తీసుకున్న స్టాండ్ నిన్నటి లాగానే ఉండాలి. స్టాండ్ మార్చకుండా ఉండి, ఏపీకి, తెలంగాణకు కావాల్సిన మంచి పనులు చేస్తారని, ఆయనకు అంత పవర్ ఉందని, ఆయన ఫాలోవర్స్ హెల్ప్ చేస్తారని నమ్ముతున్నా’ అని అన్నారు.