muktar abbas nakvi: ఏపీకి ప్రత్యేక హోదా ఎన్నికల ముందు డిమాండా?... అవహేళనగా మాట్లాడిన ముక్తార్ అబ్బాస్ నక్వి
- ఇది ఎన్నికల ఏడాది
- ప్రతీ రాష్ట్రం నుంచి డిమాండ్లు వస్తుంటాయి
- పార్లమెంటులో రిహార్సల్స్ జరుగుతుంటాయి
- ఇదో ఆచారం
ఆంధ్రప్రదేశ్ తో పాటు, దక్షిణాది పట్ల బీజేపీ ఉత్తరాది నేతలు మరోసారి చులకన భావాన్ని చాటుకున్నారు. ఇందుకు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి వ్యాఖ్యలే నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తామని రాష్ట్ర విభజన సమయంలోనే అప్పటి యూపీఏ సర్కారు పేర్కొంది. బీజేపీ కూడా ఎన్నికల ముందు ఇదే హామీ ఇచ్చి తర్వాత కేంద్రంలో కొలువుదీరింది. ఇచ్చిన హామీని తుంగలో తొక్కి నిలువునా వంచించిన మోదీ సర్కారుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసానికి సిద్ధమైన విషయం తెలిసిందే. రాష్ట్రానికి హోదా కోసం ఎవరికైనా మద్దతిస్తామంటూ టీడీపీ కూడా అవిశ్వాసానికి ఓకే చెప్పింది. కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది. మరిన్ని పక్షాలు కలసి రానున్నాయి.
దీనిపై కేంద్ర మంత్రి నక్విని మీడియా ప్రశ్నించగా... ‘‘పార్లమెంటులో ఏం జరుగుతుందో, ఏ పార్టీ ఏ మార్గాన్ని ఎంచుకుంటుందో చూద్దాం. ఏదైనా ఇది ఎన్నికల ఏడాది. కనుక ప్రతీ రాష్ట్రానికి డిమాండ్లు, అంశాలు ఉంటాయి. వాటిపై మాట్లాడడం సరికాదు. ఇది ఒక ఆచారం. ఎన్నికల ముందు పార్లమెంటులో రిహార్సల్స్ జరుగుతుంటాయి’’ అని నక్వి అన్నారు.