New Delhi: నాకు పట్టిన గతే నీ కుమార్తెకూ పడుతుంది: ప్రొఫెసర్ తో వేగలేక పారిపోయిన పీహెచ్డీ విద్యార్థిని లేఖ
- ఢిల్లీ జేఎన్యూలో ఘటన
- సభ్యత, సంస్కారం లేని ప్రొఫెసర్
- అమ్మాయిలతో ఎలా ఉండాలో తెలియదన్న విద్యార్థిని
- ఆరోపణలు అవాస్తవమన్న ప్రొఫెసర్
ఓ ప్రొఫెసర్ వేధింపులకు తాళలేని పీహెచ్డీ విద్యార్థిని, వర్శిటీ నుంచి పారిపోతూ, సదరు ప్రొఫెసర్ బండారాన్ని లేఖ రూపంలో బయటపెట్టిన ఘటన న్యూఢిల్లీలోని జేఎన్యూలో జరిగింది. యూపీకి చెందిన 26 ఏళ్ల యువతి జేఎన్యూలో ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్, పీహెచ్డీ చేస్తూ, ఇటీవల పారిపోయింది. ఈ విషయంపై పోలీసు కేసు కూడా నమోదైంది. వర్శిటీ గైడ్ గా ఉన్న ప్రొఫెసర్ ఏకే జోరి ప్రవర్తన కారణంగానే తాను వెళ్లిపోతున్నట్టు ఆ యువతి రాసిన లేఖ పోలీసులకు లభ్యమైంది.
మీకు సభ్యత, సంస్కారం లేవని, అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో తెలియదని, మీ కూతురికి ఇటువంటి పరిస్థితి రాకూడదని అనుకుంటున్నానని ఆ లేఖలో ఆమె వ్యాఖ్యానించింది. ఎంతో గొప్ప మార్గ నిర్దేశకుడిగా ఉంటారని తాను భావించానని, కానీ ఆ తరువాతే నిజస్వరూపం తెలిసిందని తెలిసింది. అమ్మాయిల బాధను అర్థం చేసుకోలేదంటూ మండిపడింది.
ఇక తనపై సదరు యువతి చేసిన ఆరోపణలను జోరి ఖండించారు. క్లాసులకు వరుసగా రాని తొమ్మిది మందిని తాను హెచ్చరించానని, వారు పీహెచ్డీ పూర్తి చేయడం కష్టమని చెప్పానని, అందరితో ప్రవర్తించినట్టే ఆమెతోనూ ప్రవర్తించానే తప్ప ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ఆ అమ్మాయి ఆరోపణలు తనకు బాధను కలిగించాయని అన్నారు.