NDA: నిర్ణయం తీసేసుకున్న చంద్రబాబు.. ఎన్డీయే నుంచి వైదొలగనున్న టీడీపీ.. నేడు ప్రకటన!
- ఎన్డీయేతో నాలుగేళ్ల బంధానికి నేటితో రాంరాం
- నేడు పొలిట్ బ్యూరో సమావేశం
- కీలక నిర్ణయాలు తీసుకోనున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ, అందుకు నిరసనగా టీడీపీ ఎంపీలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేసినా టీడీపీ ఇంకా ఎన్డీయేలోనే కొనసాగుతుండగా, తాజాగా అందులోంచి కూడా బయటకు రావాలని టీడీపీ నిర్ణయించింది. నాలుగేళ్ల బంధానికి రాం రాం చెప్పేయాలని భావిస్తోంది. నేడు జరగనున్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.
వైసీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు.. ఎన్డీయే నుంచి కూడా బయటకు రావాలని నిర్ణయించారు. నేటి పొలిట్ బ్యూరో సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై పూర్తిస్తాయిలో చర్చించిన తర్వాత ఎన్డీయేతో తెగదెంపుల విషయాన్ని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇక వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడానికి ముందు కూడా టీడీపీ నేతలు, ఎంపీలు, పార్టీ వ్యూహ కమిటీ సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అలాగే మంత్రులతో సమావేశమై చర్చించారు. ఆ తర్వాతే వైసీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.