KTR: మంత్రి కేటీఆర్ బంధువునంటూ రెవెన్యూ అధికారులపై దౌర్జన్యం.. చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ ట్వీట్

  • ఫాక్స్ సాగర్ చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు
  •  కేటీఆర్ బంధువునంటూ అధికారులపై దౌర్జన్యం
  • విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ ఆదేశం

తాను మంత్రి కేటీఆర్ బంధువునంటూ రెవెన్యూ అధికారులను బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ రెవెన్యూ పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టు మేడ్చల్ కలెక్టర్‌కు సమాచారం అందింది. దీంతో వెంటనే వెళ్లి వాటిని కూల్చివేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో స్థానిక వీఆర్వో, వీఆర్ఏలు ఎక్స్‌కవేటర్ వాహనంతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు.

నిర్మాణాలను కూల్చివేస్తుండగా అక్కడకు చేరుకున్న రంగారావు అనే వ్యక్తి రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘నేనెవరో తెలుసా?’ అంటూ అధికారులను హెచ్చరించే ప్రయత్నం చేశాడు. తాను మంత్రి కేటీఆర్ బంధువునని, నిర్మాణాలను ఎలా కూలుస్తారో చూస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు.

దీంతో తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ రంగారావుపై రెవెన్యూ అధికారులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ విషయం సోషల్ మీడియాకెక్కి వైరల్‌గా మారడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News