tabnapping: ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్...నిండా మునిగిన ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి
- ఫేస్ బుక్ లో పరిచయమైన మహిళ
- బ్రెజిల్ వాసినని, కలసి వ్యాపారం చేద్దామని ఆఫర్
- 7లక్షల డాలర్లు పంపుతానని హామీ
- లావాదేవీ ఫీజు కింద రూ.6 లక్షల దోపిడీ
మీరు తరచూ ఫేస్ బుక్ లో విహరిస్తుంటారా..? అయితే కాస్తంత జాగ్రత్తగా, తెలివిగా ఉండండి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ట్యాబ్ న్యాపింగ్ కు పాల్పడుతున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తాజాగా నేరగాళ్ల చేతిలో మోసానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతానికి చెందిన వ్యాపారికి ఫేస్ బుక్ లో ఓ మహిళ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయం చేసుకుంది. బ్రెజిల్ కు చెందిన ఓ పెద్ద గ్యాస్ కంపెనీలో తనకు పెట్టుబడులు ఉన్నాయని నమ్మబలికింది. ఇద్దరూ వాట్సాప్ లో చాట్ చేసుకున్నారు. ‘‘ఇద్దరం కలసి వ్యాపారం చేద్దాం. నేను 2.7 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తా’’ అని చెప్పింది. ముందు 7 లక్షల డాలర్లు పంపిస్తానని, ఇందుకు రిజర్వ్ బ్యాంకు నుంచి హామీ కావాలని కహానీ చెప్పింది. డేవిడ్ మార్క్ అనే వ్యక్తిని లైన్లోకి తీసుకొచ్చింది.
డేవిడ్ మార్క్ ఢిల్లీకి చెందిన వ్యాపారితో మాట్లాడి బ్రిటన్ నుంచి నగదు పంపేందుకు గాను లావాదేవీ రుసుము చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. అనంతరం అతడికి ఆర్ బీఐ పేరుతో లింక్ వచ్చింది. అది అచ్చం ఆర్ బీఐ రూపంలో ఉన్న వెబ్ సైట్. ఓ కోడ్, లాగిన్ ఐడీ కూడా ఇచ్చారు. దీంతో అంతా నిజమేనని నమ్మిన ఢిల్లీ వ్యాపారి లావాదేవీ చార్జీల కింద రూ.6 లక్షలను ఆర్ బీఐ ఫేక్ వెబ్ సైట్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేశాడు. అంతే ఆ తర్వాత ఆ సైట్ పనిచేయడం లేదు. వారిచ్చిన ఫోన్ నంబర్లూ పలకడం లేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. ట్యాబ్ న్యాపింగ్ అంటే ట్యాబ్, కిడ్నాపింగ్ కలయిక అని అర్థం. మాల్వేర్ లను చొప్పించి కీలక సమాచారాన్ని రాబడుతుంటారు.