Pierce Brosnan: పాన్ బహార్ సంస్థ నన్ను మోసం చేసింది: జేమ్స్ బాండ్
- పాన్ బహార్ సంస్థ తయారు చేసే పాన్ మసాలా హానికరమైన స్వభావాన్ని దాచిపెట్టింది
- ప్రకటన ఒప్పందం నిబంధనలను వెల్లడించలేదు
- ఒప్పందం ఎప్పుడో ముగిసింది
పాన్ బహార్ కంపెనీ తనను మోసం చేసిందని జేమ్స్ బాండ్ హీరో పియర్స్ బ్రాస్నన్ ఆరోపించాడు. ప్రస్తుతం మధ్యవయసులో ఉన్నవారందరికీ జేమ్స్ బాండ్ అంటే గుర్తువచ్చే పేరు పియర్స్ బ్రాస్నన్. 'గోల్డెన్ ఐ', 'టుమరో నెవర్ డైస్', 'వరల్డ్ ఈజ్ నాట్ ఇనఫ్', 'డై అనదర్ డే' వంటి జేమ్స్ బాండ్ సినిమాలతో పియర్స్ బ్రాస్నన్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి బ్రాస్నన్ తనను పాన్ బహార్ పాన్ మసాలా కంపెనీ మోసం చేసిందని ఢిల్లీ టుబాకో కంట్రోల్ సెల్ కు రాసిన లేఖలో ఆరోపించాడు. తనతో పాన్ బహార్ మసాలా కంపెనీ ఉత్పత్తి చేసే ప్రొడక్టు హానికరమైన స్వభావాన్ని దాచిపెట్టిందని తెలిపాడు.
అంతేకాక ప్రకటన ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను కూడా బహిర్గతం చేయలేదని తెలిపాడు. ఆ కంపెనీతో తన ఒప్పందం ఎప్పుడో పూర్తయిందని బ్రాస్నన్ తెలిపాడు. యాంటీ టుబాకో సెల్ కు అన్ని విధాలా సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. భవిష్యత్తులో ప్రజలకు హాని కలిగించే ఎలాంటి ఉత్పత్తుల కంపెనీలకు తాను సహకరించనని బ్రాస్నన్ లిఖితపూర్వక హామీ ఇచ్చాడని ఢిల్లీ హెల్త్ అదనపు డైరెక్టర్ ఎస్కే అరోరా తెలిపారు. టుబాకో ప్రొడక్ట్ ల యాక్ట్ 2003 కింద నిషేధించబడిన టుబాకో ఉత్పత్తుల ప్రకటనలకు సహకరించవద్దని సెలబ్రిటీలకు, మాస్ మీడియాను ఆయన ఆదేశించారు. యువత సెలబ్రిటీలను గుడ్డిగా అనుసరించి, వారిలా వ్యవహరించాలని చూడొద్దని ఆయన సూచించారు.