Roads: ఇక రోడ్లపై మరింత వేగంగా దూసుకెళ్లొచ్చు: గరిష్ఠ వేగాన్ని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం

  • నగరాల్లో గంటకు 70 కి.మీ వేగం
  • ఎక్స్ ప్రెస్ వేలపై 120 వరకూ కూడా
  • రోడ్ల నాణ్యత పెరిగినందునే
  • ఓకే చెప్పిన నితిన్ గడ్కరీ 

ఇక నగరాల్లోని రహదారులపైనా వాహనాలు మరింత వేగంగా దూసుకెళ్లేందుకు అనుమతిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. నగరాల్లో కనీస వేగ పరిమితిని 70 కిలోమీటర్లుగా మారుస్తూ, రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. రవాణా వాహనాలు గంటకు 60 కి.మీ. వేగంతో వెళ్లవచ్చని, టూ వీలర్లు 50 కి.మీ. వేగంగా పోవచ్చని వెల్లడించింది. అయితే, స్థానికంగా ఉండే రహదారుల నాణ్యత, భద్రత తదితరాలను దృష్టిలో ఉంచుకుని వేగ పరిమితిని తగ్గించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా మెరుగైన రహదారులు ఏర్పడటం, రింగ్ రోడ్లు, ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం సాగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఎక్స్ ప్రెస్ వేలపై గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్లేందుకు అనుమతించినట్టు కేంద్ర రవాణ శాఖ సంయుక్త కార్యదర్శి అభయ్ దామ్లే పేర్కొన్నారు. అధికారులు తయారు చేసిన ప్రతిపాదనలకు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదించినట్టు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం నగరాల్లో వాహనాల వేగ పరిమితి 40 నుంచి 50 కిలోమీటర్ల మధ్య ఉందన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News