Andhra Pradesh: ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం : మంత్రి గంటా

- మందడం పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన గంటా
- రేపటి నుంచి 29 వరకు పదో తరగతి పరీక్షలు
- రాష్ట్ర వ్యాప్తంగా 2,834 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
- పరీక్షలకు హాజరుకానున్న 6,17,484 మంది విద్యార్థులు
ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని మందడంలో ఈరోజు ఆయన పర్యటించారు. జడ్పీహెచ్ సీ పాఠశాలలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రేపటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని, మార్చి 29 వరకు జరుగుతాయని, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు గంటా చెప్పారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లు చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తారని, మొత్తం 6,17,484 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144ను అమలు చేయనున్నట్టు తెలిపారు.


156 తనిఖీ బృందాల ఏర్పాటు
పరీక్షల నిర్వహణకు 156 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామని, ఫ్లయింగ్ స్వ్కాడ్ లపై పర్యవేక్షణ వుంటుందని, ప్రతి జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నగరాల్లో విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు సెంటర్ లొకేషన్ యాప్ ను రూపొందిచామని, ఈ యాప్ ను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నెం. 18005994550 లో సంప్రదించాలని కోరారు. విద్యారంగానికి సీఎం చంద్రబాబునాయుడు పెద్ద పీట వేశారని, ఈ బడ్జెట్ లో రూ.25 వేల కోట్లకు పైగా విద్యారంగానికి కేటాయించడం జరిగిందని గంటా అన్నారు. నవ్యాంధ్రను నాలెడ్జ్ స్టే ట్ - ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. అనంతరం మధ్యాహ్నా భోజనం నాణ్యతను గంటా పరిశీలించారు.
