Pawan Kalyan: 'ఆంధ్రుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు'.. ఏపీ సీఎం చంద్రబాబుపై పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు
- ఈ నాలుగు సంవత్సరాల్లో టీడీపీ మాట్లాడిన మూడు మాటల్లో ఆరు అసత్యాలు వినపడ్డాయి
- టీడీపీ సర్కారు అలా తయారయినందుకు నాకు చాలా బాధగా ఉంది
- అంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే చంద్రబాబుకి అండగా నిలబడ్డాను.
- టీడీపీ పునర్నిర్మాణానికి కాదు
- టీడీపీ నేతలు ఆంధ్రుల ఆత్మగౌరవంతో చెలగాటం ఆడారు
మన రాష్ట్రాన్ని మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన గుంటూరులో జనసేన ఆవిర్భావ దినోత్సవ మహాసభలో మాట్లాడుతూ... "రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుందని సామెత ఉంది. చంద్రబాబుకి ఎందుకు నేను సపోర్ట్ చేశానంటే విడిపోయిన రాష్ట్రంలో చాలా అనుభవజ్ఞులు ఉండాలి. ఇవన్నీ ఆలోచించి నేను టీడీపీకి మద్దతిచ్చాను. ఈ నాలుగు సంవత్సరాల్లో టీడీపీ మాట్లాడిన మూడు మాటల్లో ఆరు అసత్యాలు వినపడుతున్నాయి నాకు. మూడు మాటలు ఆరు అసత్యాలు.
టీడీపీ సర్కారు అలా తయారయినందుకు నాకు చాలా బాధగా ఉంది. అంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే చంద్రబాబుకి అండగా నిలబడ్డాను. ఏపీ పునర్నిర్మాణం కోసం టీడీపీకి మద్దతిచ్చాను.. కానీ, టీడీపీ పునర్నిర్మాణానికి కాదు. రాజకీయాలు చేయాలంటే గుండె ధైర్యం కావాలి. దెబ్బ తినడానికి సిద్ధంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి అని నాకు తెలుసు. రాజధాని నిర్మాణం అంటూ మాత్రమే చంద్రబాబు మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే కొందరికేనా అందరికీ కాదా? అందరికీ కావాలంటే ఏం చేయాలని టీడీపీ నేతలు ఆలోచించడం లేదు. విదేశీ పెట్టుబడులు తీసుకొస్తామన్నారు తీసుకురాలేదు.. యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? కేవలం రాజధాని ప్రాంతం చుట్టూ మాత్రమే అభివృద్ధిపై దృష్టి పెడితే ఎలా? ఉత్తరాంధ్ర ఏం కావాలి? రాయలసీమ ఏం కావాలి? ప్రకాశం జిల్లా ఏం కావాలి?
మళ్లీ మనకి తెలంగాణ ఉద్యమం వచ్చినట్లుగా మరోసారి మరో ఉద్యమం రాదా? కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పినప్పుడు రాత్రికి రాత్రి చీకటి ఒప్పందాలు చేసుకుని ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని చంద్రబాబు చెప్పారు. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలు అని అన్నాను. ఆ పాచిపోయిన లడ్డూలే కావాలని అన్నారు. ఒక ముఖ్యమంత్రి, మిగతా మంత్రి వర్గం అంతాకలిసి ప్రజలని ఏమనుకుంటున్నారు? వారికి తెలివితేటలు లేవని అనుకుంటున్నారా? నిశబ్దం చేతకాని తనమని అనుకోకండి.. ప్రత్యేక హోదా కావాలని గవర్నర్ నరసింహన్ తో కూడా చదివించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు టీడీపీ నేతలు ఆంధ్రుల ఆత్మగౌరవంతో చెలగాటం ఆడారు" అని అన్నారు.