Pawan Kalyan: మనకు చేసిన ద్రోహాన్ని ఢిల్లీకి వినపడేలా ప్రశ్నిద్దాం: పవన్ కల్యాణ్
- నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేస్తూనే ఉన్నారు
- తెలుగువారు టంగుటూరి ప్రకాశం వారసులు
- మాకు ఎలాంటి భయం లేదు
- అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ఆంధ్రుల గుండెల్ని పిండేస్తోంది
కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యేలా తాను మొదట ఇంగ్లిషులో మాట్లాడతానని, తనకు భయం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగువారు టంగుటూరి ప్రకాశం వారసులని, వారికి ఎలాంటి భయం లేదని అన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన ద్రోహాన్ని ఢిల్లీకి వినపడేలా ప్రశ్నిద్దామని వ్యాఖ్యానించారు. ఈ రోజు గుంటూరులో నిర్వహిస్తోన్న జనసేన ఆవిర్భావ మహాసభలో ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూనే ఉందని అన్నారు.
'మీరిచ్చిన మాటలను మీరు నిలబెట్టుకోనప్పుడు మీ చట్టాలను మేమెందుకు పాటించాలి?' అని పవన్ ప్రశ్నించారు. అప్పట్లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని, మళ్లీ ఇటీవల అందుకు భిన్నంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ఆంధ్రుల గుండెల్ని పిండేస్తోందని అన్నారు. రాజధాని లేకుండా తెలంగాణ నుంచి ఆంధ్రులని పంపించేశారని, విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని వ్యాఖ్యానించిందని, ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఇవ్వడం లేదని అన్నారు.
ప్రజాస్వామ్యానికి దేవాలయంలాంటి పార్లమెంటులో ఇచ్చిన మాట తప్పుతారా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు.