Shami: షమీ-జహాన్ దంపతుల గొడవపై పెద్ద కుమార్తె వేదన
- షమీకి ముందు సైఫుద్దీన్‌తో హసీన్ వివాహం
- వారిద్దరికి ఇద్దరు కుమార్తెలు..పదకొండో తరగతి చదువుతోన్న పెద్ద కుమార్తె
- అమ్మ-నాన్నల గొడవ గురించి ఫ్రెండ్స్ పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారని బాలిక ఆవేదన
- తల్లిదండ్రులు తిరిగి ఒకటి కావాలని భగవంతుడికి ప్రార్థన
తల్లిదండ్రులు గొడవపడితే పిల్లలు మనోవేదనకు గురవుతుంటారు. ఆ గొడవ గురించి బయటివారు అడిగినప్పుడు వారి మనసు మరింతగా నొచ్చుకుంటుంది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన వ్యవహారాలను నడిరోడ్డుపైకి తెచ్చుకున్న క్రికెటర్ షమీ-హసీన్ జహాన్ దంపతుల పెద్ద కుమార్తెకు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. జహాన్‌కు షమీ కంటే ముందు షేక్ సైఫుద్దీన్ అనే వ్యక్తితో వివాహమయింది. వారిద్దరికి ఇద్దరు కుమార్తెలు. సైఫుద్దీన్‌తో జహాన్ విడాకులు తీసుకుని షమీని పెళ్లి చేసుకుంది. ఇద్దరు కుమార్తెలు ఆమె వద్దనే ఉండాలంటూ కోర్టు తీర్పునిచ్చింది. కానీ, షమీతో వివాహం నేపథ్యంలో పిల్లలిద్దరూ తిరిగి తమ తండ్రి సైఫుద్దీన్ వద్దకే చేరుకున్నారు. ఆ ఇద్దరు పిల్లలు షమీ చూపించే ప్రేమ వల్ల ఆయన్ని 'పాపా (నాన్న)' అని పిలిచేవారని సైఫుద్దీన్ చెప్పుకొచ్చాడు.
పెద్దమ్మాయి ప్రస్తుతం పదకొండో తరగతి చదువుతోంది. తన తల్లిదండ్రుల గొడవ గురించి తన మిత్రులు తనను 'మీ తల్లిదండ్రులతో మాట్లాడావా? లేదా? మీ నాన్న అలాంటి వ్యక్తా? అంటూ పిచ్చిపిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారని ఆమె ఆవేదన చెందుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వారిద్దరూ తిరిగి ఒకటి కావాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది. చివరికి కోల్‌కతాలోని సూరీలో జనరల్ స్టోర్ నడుపుకునే తనను కూడా చాలా మంది షమీ-జహాన్ దంపతుల గొడవ గురించి అడుగుతున్నారని సైఫుద్దీన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.