Chandrababu: ఏంటిది పీయుష్ గోయల్... చంద్రబాబు నిప్పులు!
- మిత్రపక్షాన్ని కాదని వైకాపాకు అపాయింట్ మెంటా?
- రైల్వే మంత్రి చర్య సరైనది కాదు
- ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు
మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ఇచ్చిన అపాయింట్ మెంట్ ను రద్దు చేసి, వైకాపాకు చెందిన ఎంపీని పిలిపించుకుని మాట్లాడటం రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ కు సరికాదని, ఆయన వైఖరిని తాను ఖండిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, రైల్వే జోన్ గురించి మాట్లాడాలని టీడీపీ ఎంపీలు సమయం అడిగితే సరేనని చెప్పి, ఆ తరువాత ఖాళీ లేదని అన్నారని, అప్పటికప్పుడు వైసీపీ ఎంపీ వరప్రసాద్ కు సమయం ఇచ్చారని గుర్తు చేసిన ఆయన, బీజేపీకి మిత్రపక్షం వైకాపానా? టీడీపీయా? అన్న సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయని అన్నారు.
సమస్యలపై స్పందించని కేంద్రం, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించిన ఆయన, దశలవారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. లోక్ సభలో, రాజ్యసభలో ఏపీ సమస్యలు ప్రతిధ్వనించాలని, ఢిల్లీ వేదికగా పోరాటం సాగించడం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడవచ్చని అన్నారు. ఆర్థిక బిల్లులపై చర్చ సాగుతున్న వేళ, రాష్ట్రానికి హోదా, నిధుల సాయంపై మాట్లాడాలని, ఎంపీలందరూ సభకు విధిగా హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజల కోసం పనిచేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకుని మెలగాలని, ప్రతిపక్షాలను ప్రజలు మరచిపోయేలా చేయాలని అన్నారు.