Telangana: రెండు అసెంబ్లీ సీట్లు ఖాళీ అయ్యాయి... ఈసీకి వెల్లడించిన తెలంగాణ సర్కారు
- నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
- గత రాత్రే గెజిట్ నోటిఫికేషన్ విడుదల
- ఆ వెంటనే దాన్ని ఈసీకి పంపిన సర్కారు
- నేడు అభిప్రాయం చెప్పనున్న ఈసీ
మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై హెడ్ ఫోన్స్ తో దాడి చేసి, ఆయన కళ్లకు గాయం చేశారన్న ఆరోపణలపై నిన్న కాంగ్రెస్ శాసన సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసిన తెలంగాణ అసెంబ్లీ, గత రాత్రి ఆ విషయాన్ని గెజిట్ ద్వారా వెల్లడించింది. గెజిట్ ప్రతిని భారత ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పంపుతూ, తమ రాష్ట్రంలో రెండు అసెంబ్లీ సీట్లు ఖాళీ అయ్యాయని పేర్కొంది. నేడు గెజిట్ నోటిఫికేషన్ పై ఎన్నికల కమిషనర్ స్పందించే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో 14 నెలల సమయం ఉండటంతో ఉప ఎన్నికలు జరిపించేందుకు ఈసీ మొగ్గు చూపుతుందా? లేదా? అన్న విషయం తెలియాల్సి వుంది. నేడు కాంగ్రెస్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించనుండగా, అక్కడ వారికి ఊరట లభించి, అసెంబ్లీ తీసుకున్న నిర్ణయంపై స్టే వస్తే, ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండవని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.