Virat Kohli: 'మైదానంలో ఉండే కోహ్లీకి... ఇంట్లో ఉండే కోహ్లీకి చాలా తేడా ఉంటుంది'
- నేను చాలా బద్దకస్తుడ్ని
- ఇంట్లో నా ప్రవర్తన చిరాకు తెప్పించేలా ఉంటుంది
- గంటల కొద్దీ ఒకే చోట కూర్చుండిపోతాను
మైదానంలో చూసే విరాట్ కోహ్లీకి ఇంట్లోని కోహ్లీకి అంతులేని తేడా ఉంటుందని టీమిండియా కెప్టెన్ చెబుతున్నాడు. మైదానంలో పాదరసంలా కదిలే కోహ్లీ ఇంట్లో మాత్రం చిరాకుతెప్పించేంత బద్దకంతో ఉంటాడని వెల్లడించాడు. ఒక ప్రచార కార్యక్రమంలో తన గురించి కోహ్లీ చెబుతూ, తనంత బద్దకస్తుడు మరొకడు ఉండడని పేర్కొన్నాడు. ఇంట్లో తాను చేయాల్సిన పనులేమీ లేకపోతే గంటల కొద్దీ ఒకే చోట మొద్దులా కూర్చుండిపోతాననని అన్నాడు.
ఇంట్లో తన ప్రవర్తన ఇతరులకు చిరాకు తెప్పించేలా ఉంటుందని చెప్పాడు. తనకు దొరికిన విశ్రాంతిని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని అన్నాడు. క్రికెట్ మ్యాచ్ లు చూడడంలేదని, ఫలితం మాత్రం తెలుసుకుంటున్నానని చెప్పాడు. జట్టులో తానెవరికైనా బహుమతి ఇవ్వాల్సి వస్తే యజువేంద్ర చాహల్ కి చేతిగడియారం బహుమతిగా ఇస్తానని అన్నాడు. చాహల్ ప్రతిసారీ ప్రాక్టీస్ కి ఆలస్యంగా వస్తాడని కోహ్లీ చెప్పాడు.
తన ఫేవరేట్ ఆటగాడు రోజర్ ఫెదరర్ అని కోహ్లీ తెలిపాడు. విశ్రాంతి సమయంలో ఆయన ఆటోబయోగ్రఫీ చదవానని చెప్పాడు. ఫెదరర్ మంచి ఆటగాడని, అతనికి చక్కని కుటుంబం ఉందని చెప్పాడు. ప్రధానంగా ఫెదరర్ కి తన ప్రాధాన్యాలేంటో తెలుసని అన్నాడు. విమర్శలు, వ్యాఖ్యానాల గురించి పట్టించుకోకుండా విజయం గురించి మాత్రమే ఆలోచిస్తాడని అన్నాడు. అందుకే అలవోక విజయాలతో అసాధ్యం అనే మాటను సవాల్ చేస్తున్నాడని పేర్కొన్నాడు. తన బయోపిక్ ను తీస్తే కొత్త నటుడు సమర్థవంతంగా నటించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అయినా తన బయోపిక్ తీసేందుకు అంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చని చెప్పాడు.