Indian Army: 68 శాతం ఆయుధాలు పురాతన కాలం నాటివే... సైన్యం అసంతృప్తి!

  • అత్యధిక ఆయుధాలు పాతకాలం నాటివి
  • బడ్జెట్ కేటాయింపులు సరిపోవు
  • పార్లమెంటరీ కమిటీ ముందు ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్

ఇండియాలో సైన్యం వినియోగిస్తున్న ఆయుధాల్లో అత్యధికం పాతకాలం నాటివేనని, ఈ సంవత్సరం రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ తో సైన్యం అవసరాలు ఏమాత్రం తీరే అవకాశం లేదని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వెల్లడించారు. 68 శాతం ఆయుధాలు పురాతన ఆయుధాలేనని చెప్పిన ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్, మేకిన్ ఇండియాలో భాగంగా 25 ఆయుధ పరికరాల తయారీ ప్రాజెక్టులను గుర్తించామని, వీటిల్లో అత్యధికం నిధులు లేక ఆగిపోయాయని తెలిపారు. 2018-19 బడ్జెట్ లో మరిన్ని నిధులు కేటాయిస్తారని ఆశించామని, అయితే, సైన్యం అవసరాలను తీర్చేలా కేటాయింపులు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే దక్కింది అరకొరేనని, దీంతో తాము అసంతృప్తిలో ఉన్నామని ఆయన పార్లమెంటరీ ప్యానల్ కు వెల్లడించారు. కాగా, ఈ సంవత్సరం బడ్జెట్ లో తనకు రూ. 37 వేల కోట్లను కేటాయించాలని ఆర్మీ కోరగా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ. 21,338 కోట్లు మాత్రమే కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులు తమ ఆయుధ కొనుగోలు ప్రణాళికలకు ఎంతమాత్రమూ సరిపోవన్నది ఆర్మీ అధికారుల అభిప్రాయం.

Indian Army
Union Budget 2018-19
Wepons
Make in India
  • Loading...

More Telugu News