YSRCP: ఏపీలో పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఉమ్మడి హైకోర్టు నోటీసులు
- పిల్ పై ధర్మాసనం ఈరోజు విచారణ
- టీడీపీలో చేరిన 22 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ
- ఏపీ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి కూడా నోటీసులు
ఏపీలో పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఉమ్మడి హైకోర్టు ఈరోజు నోటీసులు జారీ చేసింది. వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన 22 మంది ఎమ్మెల్యేలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ఈ మేరకు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పై ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. కాగా, వైసీపీ తరపున గెలిచిన ఎన్. అమర్ నాథ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, చిదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, భూమా అఖిల ప్రియలు టీడీపీలో చేరి, మంత్రి పదవులు అనుభవిస్తున్నారని, ఆ పదవుల్లో కొనసాగే అర్హత వారికి ఎంత మాత్రం లేదని, రద్దు చేయాలని ఆ పిల్ లో ఆయన కోరారు.
ఫిరాయింపుదారులు ఎమ్మెల్యేలుగా కొనసాగేందుకు అర్హులు కారని, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వారికి ఒక్కొక్కరికీ రోజుకు రూ.500 చొప్పున ఫైన్ విధించాలని, ఈ వ్యాజ్యం తేలే వరకూ వారు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగేందుకు వీలు లేకుండా ఆదేశించాలని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అన్నా వెంకట రాంబాబు తన పిల్ లో కోరడం గమనార్హం.