Artificial heart: గుండె కోసం అవయవదానం వరకు ఎదురు చూడక్కర్లేదు..!

  • కృత్రిమ గుండెను తయారు చేసిన ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
  • కృత్రిమ గుండెను అభివృద్ధి చేసిన డాక్టర్ రిచర్డ్ వాంప్లర్
  • ఆవులు, గొర్రెలపై విజయవంతంగా పరీక్షించిన వాంప్లర్

గుండె మార్పిడి కోసం ఇకపై వేదనతో అవయవదానం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ రిచర్డ్‌ వాంప్లర్‌ చేసిన పరిశోధనలు తుది అంకానికి చేరుకున్నాయి. ఇంత వరకు గుండె పనితీరు మందగిస్తే కృత్రిమ గుండెను అమర్చి, ఎవరైనా అవయవదానం చేసేవరకు రోగిని బతికించేవారు.

ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా..ఈ కృత్రిమ గుండెను శాశ్వతంగా పని చేసేలా రూపొందించారు. దీనిని 2014 నుంచి డాక్టర్ వాంప్లర్ అభివృద్ధి చేస్తున్నారు. ఆయన పరిశోధనల ఫలితంగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న కృత్రిమ గుండెలో మాదిరిగా బోలెడన్ని భాగాలు లేని కృత్రిమ గుండె ఆవిష్క్రతమైంది. వాంప్లర్ తయారు చేసిన కృత్రిమ గుండెలో ఒకే ఒక్క కదిలే భాగం ఉంటుంది. అలాగే మనిషి గుండెలో మాదిరిగా కవాటాలు ఉండవు.

టైటానియం గొట్టంలో అటు,ఇటు కదిలే గొట్టం లాంటి నిర్మాణం ఉంటుంది. కదిలే గొట్టం దిగువ భాగంలో రెండు కవాటాల మాదిరిగా పనిచేసే నిర్మాణం ఉంటుంది. ఇది సమర్ధవంతంగా పని చేస్తుందని ఒరెగాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కృత్రిమ గుండె బ్యాటరీ సాయంతో పనిచేస్తుందని వారు తెలిపారు. దీనిని ఆవులు, గొర్రెల్లో విజయవంతంగా పరీక్షించామని వారు తెలిపారు. దీని పనితీరు మరో మూడు నెలల గమనించి, ఆ తరువాత మానవులకు అమర్చుతామని వారు తెలిపారు.

Artificial heart
heart Disease
heart innovation
  • Loading...

More Telugu News