honda x blade: హోండా నుంచి స్పోర్టీ లుక్ తో కొత్త బైక్... 160 సీసీ ఎక్స్ బ్లేడ్ విడుదల
- ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.78,500
- నేటి నుంచే దేశవ్యాప్తంగా బుకింగ్
- అలాయ్ వీల్స్, ఎల్ఈడీ ల్యాంప్స్, డిజిటల్ మీటర్ వంటి ఎన్నో ఫీచర్లు
దేశంలో రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన విక్రయ సంస్థ, జపాన్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ మరో హైఎండ్ బైక్ ను దేశీయ మార్కెట్లోకి ఈ రోజు విడుదల చేసింది. 160సీసీ సామర్థ్యం కలిగిన ఎక్స్ బ్లేడ్ మోడల్ ను ముంబైలో ఆవిష్కరించింది. దీని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.78,500. యూనికార్న్, హార్నెట్, సీబీఆర్ తరహాలోనే అదే సామర్థ్యంతో ఎక్స్ బ్లేడ్ ను తీసుకొచ్చింది.
పూర్తి ఎల్ఈడీతో కూడిన హెడ్ ల్యాంప్, అలాగే, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, స్పోర్టీ లుక్ తో ఉండే ఫ్యుయల్ ట్యాంకు, అలాయ్ వీల్స్, డ్యుయల్ అవుట్ లెట్ మఫ్లర్, డిజిటల్ స్పీడియో మీటర్ ఉన్నాయి. ఏ గేర్ లో ఉన్నదీ డిస్ ప్లే లో తెలుసుకోవచ్చు. ఎక్స్ బ్లేడ్ మోడల్ బైక్ ల పంపిణీ ప్రారంభించామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యదవీందర్ సింగ్ గులేరియా తెలిపారు. దేశవ్యాప్తంగా హోండా డీలర్ల వద్ద రూ.5,000తో బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు.