Australia: పోర్షే కారు కొన్న మోజైనా తీరలేదు పోలీసులు సీజ్ చేసేశారు
- పోర్షే కారు కొని జాయ్ రైడ్ కు బయల్దేరిన యజమాని
- తొలి రైడ్ ను చిరకాలం పదిలం చేసుకునేందుకు వీడియో చిత్రీకరణ
- పదినిమిషాల్లోనే పోలీసులు కారు ఆపి, 30 రోజుల సీజ్
లగ్జరీ బ్రాండ్ పోర్షె కారు కొన్న పది నిమిషాలకే సీజ్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ కు చెందిన 37 ఏళ్ల వ్యక్తి లగ్జరీ బ్రాండ్ పోర్షే కారు కొన్న ఆనందంలో మెల్ బోర్న్ లోని ఆల్బర్ట్ పార్క్ లో జాయ్ రైడ్ కు వెళ్లాలని బయల్దేరాడు. కొత్త కారులో తన మొదటి రైడ్ గుర్తుండిపోవాలని మొబైల్ ఫోన్ లో తన ప్రయాణాన్ని వీడియో కూడా తీసుకుంటున్నాడు. గ్రాండ్ ప్రీ సర్క్యూట్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు అతడి కారును ఆపారు.
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సిన రోడ్డుపై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడని ఆరోపిస్తూ, నెలరోజులపాటు కారును సీజ్ చేస్తున్నామని ప్రకటించారు. దీంతో బిత్తరపోయిన కారు ఓనర్, కారు ఇప్పుడే కొనుక్కున్నానని, తొలి తప్పుగా భావించి వదిలేయాలని బతిమాలుకున్నాడు. రూల్స్ వివరించిన పోలీసులు. అతనిపై అతివేగం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ తదితర కేసులు నమోదు చేసి, కారును తమతో తీసుకెళ్లిపోయారు. ఈ వివరాలు వెల్లడిస్తూ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు కారు యజమానిపై జాలి పడుతూ, పోలీసుల్ని అభినందిస్తున్నారు.