TRS: నలుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెండ్ ఖాయం... ఏడాదా? బడ్జెట్ సమావేశాల వరకా?!
- నిన్నటి ఘటనలకు నలుగురిని బాధ్యులుగా భావిస్తున్న టీఆర్ఎస్
- అసెంబ్లీలో చర్చించి వేటుపై ప్రకటన
- కెమెరా ఫుటేజ్ ని పరిశీలించిన మదుసూధనాచారి
నిన్న తెలంగాణ అసెంబ్లీలో జరిగిన కాంగ్రెస్ నిరసనలు, ఆపై కోమటిరెడ్డి హెడ్ ఫోన్స్ విసిరేయడంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు గాయం కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అధికార టీఆర్ఎస్ కనీసం నలుగురు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్ మధుసూధనాచారి, సభలో నిన్న తీసిన వీడియో ఫుటేజ్ ని పరిశీలించారు. ఈ ఫుటేజ్ లో హెడ్ ఫోన్స్ విసిరిన తరువాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తన పక్కనే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో, తాను విసిరిన హెడ్ ఫోన్స్ ఆయన కంటికి తగిలాయని చూపుతుండటం కనిపిస్తోంది. ఆపై సరోజినీ దేవి ఆసుపత్రి వైద్యుల నివేదికనూ పరిశీలించిన ఆయన, కోమటిరెడ్డి తప్పు చేశారన్న భావనకు వచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా, నలుగురు సభ్యులను ఈ సెషన్ నుంచి సస్పెండ్ చేయాలా? లేక ఏడాది పాటు సస్పెండ్ చేయాలా? అన్నది అసెంబ్లీలో చర్చించి నిర్ణయించాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయబోనని స్వామిగౌడ్ వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన వ్యవహారం కాబట్టి, అసెంబ్లీలోనే తేలుస్తారని, వ్యక్తిగతంగా తాను ఎవరిపేరునూ వెల్లడించబోనని ఆయన అన్నారు. ఇదిలావుండగా, తమ సభ్యులను సస్పెండ్ చేస్తే సభను బహిష్కరించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం.