Visakhapatnam: రైల్వే జోన్‌తో ఏమొస్తుందయ్యా.. కొత్తగా జనరల్ మేనేజర్ తప్ప: ఏపీ అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి

  • ముసుగులో గుద్దులాటకు కేంద్రం తెర
  • ఇవ్వలేమని చేతులెత్తేసిన వైనం  
  • జోన్ వల్ల పదిమంది ఉద్యోగులు తప్ప ఇంకేం ఉండదన్న హోంశాఖ కార్యదర్శి

ఇన్నాళ్ల ముసుగులో గుద్దులాటకు కేంద్రం తెరదించింది. విశాఖ రైల్వే జోన్‌పై ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశలను ఆవిరి చేసింది. ఇన్నాళ్లు రేపు, మాపు అంటూ చెప్పుకొచ్చిన కేంద్రం ఇక కుదరదని చేతులెత్తేసింది. అసలు రైల్వే జోన్ వల్ల ఏమొస్తుంది? కొత్తగా ఓ జనరల్ మేనేజర్, మరొకొందరు ఉద్యోగులు తప్ప.. అని తెగేసి చెప్పింది. అసలు రాష్ట్రానికి రైల్వే జోన్ కావాలో.. రైల్వే లైన్ కావాలో తేల్చుకోమని చెప్పింది.

రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న హామీల అమలు పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గాబాతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. ఏపీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా ఏపీ అధికారులు రైల్వే జోన్ గురించి ప్రస్తావించగా రాజీవ్ గాబా మాట్లాడుతూ ప్రత్యేక రైల్వే జోన్ వల్ల ఏపీకి ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ ఉండబోదన్నారు. అయినప్పటికీ ఏపీ అధికారులు తగ్గకపోవడంతో ఈ విషయంలో రాజకీయ నిర్ణయం అవసరమని, నెల రోజుల్లో కేంద్ర హోంమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబును కూడా పిలుద్దామని అన్నారు. అలాగే దుగరాజపట్నం పోర్టు, కడపలో ఉక్కు కర్మాగారంపైనా కేంద్రం నుంచి స్పష్టమైన హామీలు రాలేదు. రాష్ట్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఐఐటీ, ఐఐఎం తదితర సంస్థలకు సంబంధించి భవనాల నిర్మాణాలు ఇప్పటి వరకు మొదలు కాలేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో త్వరలోనే వీటి నిర్మాణాలు ప్రారంభించాలని సంబంధిత శాఖలను హోం శాఖ కార్యదర్శి రాజీవ్ ఆదేశించారు.  
 
అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, విశాఖపట్నం జిల్లాలో గిరిజన వర్సిటీ కోసం కేబినెట్‌ నోట్‌ వెళ్లిందని... కేంద్ర మంత్రి మండలి దాన్ని ఆమోదించాక లోక్‌సభకు బిల్లు వస్తుందని చెప్పారు. ఈలోపు తాత్కాలికంగా తరగతులు ప్రారంభించాలని సీఎస్‌ కోరారు. పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల్లో 25 ఎకరాలు వివాదాల్లో ఉందని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ఆ సమస్యను పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.

అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చినట్టు చెబుతున్న రూ.2500 కోట్లలో గుంటూరు, విజయవాడలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి ఇచ్చిన రూ.వెయ్యి కోట్లను కూడా కలిపారని, వాటిని రాజధాని నిర్మాణానికి ఇచ్చిన నిధుల్లో చేర్చవద్దని ఏపీ అధికారులు కోరారు. దీనికి కొంత సానుకూలంగా స్పందించారు. వీటితోపాటు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వయబిలిటీ గ్యాప్ ఫండ్ తగ్గించడం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ తదితర వాటిపైనా చర్చ జరిగింది. తాజా సమావేశంపై ఏపీ అధికారులు మాట్లాడుతూ కొంత సానుకూలంగానే జరిగిందన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News