Congress: ఇవాళ అసెంబ్లీలో జరిగిన ఘటనకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి : కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
- నిన్నటి టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కుట్ర జరిగింది
- అసెంబ్లీలో సమావేశాల్లో నిరసన తెలిపితే సస్పెండ్ చేస్తామని ఎల్పీ భేటీలో కేసీఆర్ ఎలా చెబుతారు?
- గవర్నర్ కు క్రమశిక్షణ ఉండదా?
- సభకు ఆయన ఆలస్యంగా ఎలా వస్తారు? : జీవన్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు జరిగిన ఘటనకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో తీవ్ర గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేతలు గూండాల్లా వ్యవహరించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కుట్ర జరిగిందని ఆరోపించారు. అసెంబ్లీలో సమావేశాల్లో నిరసన తెలిపితే ఆ సెషన్ మొత్తం వారిని సస్పెండ్ చేస్తామని, ఎల్పీ భేటీలో కేసీఆర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. గవర్నర్ కు క్రమశిక్షణ ఉండదా? సభకు ఆయన ఆలస్యంగా ఎలా వస్తారు? అని ప్రశ్నించారు.