woman: మరో యువతితో 'ఎఫైర్' కాదన్నందుకు తల్లినే కడతేర్చిన టీనేజ్ గర్ల్...!
- మహిళా టీచర్‌తో జీవించేందుకు వద్దందని తల్లిని కర్ర, రాడ్‌తో కొట్టి చంపిన యువతి
- గతంలోనూ ఇంటి నుంచి పారిపోయిన వైనం
- తండ్రి ఫిర్యాదుతో నిందిత యువతి అరెస్టు
ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావంతో ఈ మధ్యకాలంలో యువత పెడదోవ పడుతున్నారు. చివరకు తాము బాధపడటమే కాక కన్నవారినీ క్షోభ పెడుతున్నారు. తాజాగా యూపీలోని ఘజియాబాద్‌లో ఓ మహిళా టీచర్‌తో తన సంబంధానికి అడ్డుగా ఉందన్న నెపంతో ఓ 18 ఏళ్ల యువతి తన కన్నతల్లినే కడతేర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 'హిందూస్థాన్ టైమ్స్' నివేదిక ప్రకారం, ఈ నెల 9న నిందిత యువతి తన 38 ఏళ్ల తల్లి తలపై కర్ర, ఇనుప రాడ్డుతో బలంగా కొట్టి చంపింది. మహిళా టీచర్‌తో సంబంధం పెట్టుకోవడమే కాక తనతో కలిసి వెళ్లిపోవడానికి ఆమె నిర్ణయించుకుంది. కానీ, ఈ విషయం తెలిసినప్పటి నుంచి యువతి తల్లిదండ్రులు ఆమెను మందలిస్తూనే వచ్చారు. ఇది మంచిది కాదని చాలాసార్లు తనకి నచ్చజెప్పారు.
కాగా, తల్లిని చంపి పారిపోయిన సదరు యువతిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. తండ్రి సతీశ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఆమెపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. టీచర్‌తో తమ కుమార్తె సంబంధం విషయమై తమ కుటుంబంలో చాలా రోజులుగా గొడవ జరుగుతోందని ఆయన చెప్పారు. మరోవైపు టీచర్‌పై కూడా కవి నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. కాగా, గతేడాది సెప్టెంబరులో 35 ఏళ్ల టీచర్‌తో కలిసి జీవించేందుకు సదరు యువతి తొలుత ఇల్లు విడిచి పారిపోయింది. అయితే మైనర్ కావడంతో ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచకపోతే ఇలాంటి చిత్రమైన పరిస్థితులే ఎదురవుతాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.