Jeevan Reddy: మందు కొట్టి అసెంబ్లీకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... స్వామిగౌడ్ పై హత్యాయత్నం: టీఆర్ఎస్ ఆరోపణ
- నిన్ననే దాడికి దిగాలని ప్రణాళిక
- కోమటిరెడ్డి హత్యాయత్నం చేశారనడానికి వీడియో సాక్ష్యం
- తీవ్రంగా పరిగణిస్తున్నామన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఓ పథకం ప్రకారం ఈ ఉదయం తెలంగాణ అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందుకొట్టి వచ్చారని, అసెంబ్లీలో గవర్నర్, స్పీకర్, మండలి చైర్మన్ లపై దాడికి దిగాలని నిన్ననే ప్రణాళిక రూపొందించుకున్నారని టీఆర్ఎస్ సంచలన ఆరోపణలు చేసింది. మండలి చైర్మన్ స్వామిగౌడ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హత్యాయత్నం చేశారని, దీనికి రికార్డెడ్ వీడీయో సాక్ష్యం ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడించారు. సభలో కాగితాలు చింపి నిరసన తెలపడం సాధారణమేనని, అయితే, అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా టార్గెట్ చేసుకుని ఆసుపత్రి పాలు చేయడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు.
ఓ పెన్ను తీసుకుని విసిరేసినా అది కణతకు తగిలితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని, కన్నుకు తగిలితే చూపు పోతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ సభ్యులు తొలుత స్పీకర్ మధుసూదనాచారిపై, ఆపై గవర్నర్ నరసింహన్ పై హెడ్ ఫోన్స్ విసిరినట్టు వీడియో సాక్ష్యముందని, ఆపై గురిచూసి స్వామిగౌడ్ ను కోమటిరెడ్డి కొట్టారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సు యాత్రగా మారగా, అవమాన భారంతో ఉన్న కాంగ్రెస్ ఈ విధంగా ప్రవర్తించిందని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా దాడి చేస్తారని తాము ముందుగానే ఊహించామని జీవన్ రెడ్డి అన్నారు.