glaucoma: గ్లకోమా సమస్య వస్తే చూపు పోయే ప్రమాదం... ఇలా గుర్తించొచ్చు
- ఈ నెల 11 నుంచి 17 వరకు గ్లకోమా వీక్
- కంటి చూపు తగ్గితే నిర్లక్ష్యం తగదు
- కన్ను ఎర్రబారినా, చూపు తగ్గినా వైద్యులను సంప్రదించాలి
గ్లకోమా సమస్య కంటి చూపును దెబ్బతీసే మహమ్మారి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారిలో దీని రిస్క్ ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వారిలో కంటి చూపు కోల్పోవడానికి ప్రధాన కారణం ఇదేనని వైద్యుల పరిశోధన ఫలితాల ఆధారంగా తెలుస్తోంది. ప్రపంచ గ్లకోమా వారోత్సవం ఈ నెల 11 నుంచి 17 వరకు జరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్లకోమా సమస్యను ముందుగా గుర్తించి నివారించుకోవడం ఎలానో చూద్దాం.
ఓపెన్ యాంగిల్ గ్లకోమా
గ్లకోమాలో రెండు రకాలున్నాయి. వీటిలో ఒకటి ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా. దీన్నే క్రానిక్ గ్లకోమా అని కూడా అంటారు. అత్యంత సాధారణంగా వచ్చే రకం ఇది. క్రమంగా పెరుగుతూ వెళుతుంది. అయినా దీని లక్షణాలు బయటకు కనిపించవు. కంటి చూపు మందగించడం ఒక్కటే సంకేతంగా భావించాలి. అందుకే కంటి చూపులో తేడా వస్తే నిర్లక్ష్యం చేయడం తగదు. ఈ దృష్ట్యా 40 ఏళ్లు దాటిన వారు ఏడాదికోసారి సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించుకోవడం మంచిది.
క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా
దీన్నే అక్యూట్ యాంగిల్ గ్లకోమా లేదా న్యారో యాంగిల్ గ్లకోమా అని కూడా అంటారు. ఇది అత్యవసర పరిస్థితి. ఉన్నట్టుండి వస్తుంది. తీవ్రంగా కంటి నొప్పి, కంటి వెంట నీరు కారడం, కంట్లో ఎర్ర బారడం, కంటి చూపు మసకగా మారడం, లైట్ చూస్తున్నప్పుడు చుట్టూ కాంతి వయాల్లాంటివి కనిపించడం, తల తిరగడం, వాంతులు, తలనొప్పి ఇవన్నీ గ్లకోమా సంకేతాలు. వీటిలో ఏదైనా సమస్య మీకు ఉన్నట్టు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.