Telangana: కాగితాలు చింపి విసిరేస్తూ నినాదాలు జోరు పెంచిన కాంగ్రెస్... తెలంగాణ అసెంబ్లీలో రభస!

  • పోడియంలోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు
  • గవర్నర్ ప్రసంగం ప్రతులను చింపి నిరసన
  • ఆందోళనను పట్టించుకోకుండానే గవర్నర్ ప్రసంగం

గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వేళ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపి విసిరేస్తూ, నినాదాలతో పోడియంలోకి దూసుకురావడంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మార్షల్స్ అడ్డుకుంటున్నా, వారిని తోసుకుంటూ కాంగ్రెస్ సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చారు. గవర్నర్ ఏం మాట్లాడుతున్నారన్న విషయం కూడా సరిగ్గా వినిపించని స్థాయిలో అసెంబ్లీలో రభస జరుగుతోంది. తన ప్రసంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనను పట్టించుకోకుండా నరసింహన్ తన పనిని తాను చేసుకుపోయారు.

ప్రజా సంక్షేమంలోనూ, పాలనలోనూ పారదర్శకతను పెంచడంలో తన ప్రభుత్వం ఎన్నో అడుగులు ముందుకు వేసిందని గవర్నర్ తెలిపారు. దేశంలోనే అత్యధిక సౌరశక్తిని తయారు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. పారిశ్రామిక విధానాన్ని ఎంతో సులభతరం చేశామని, ఎన్నో కంపెనీలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నాయని అన్నారు. టీఎస్ ఐపాస్ ఎంతో విజయవంతం అయిందని అన్నారు. వ్యాపారాన్ని సులభతరంగా నిర్వహించుకునే సౌలభ్యమున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ర్యాంకు మెరుగు పడిందని గవర్నర్ గుర్తు చేశారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పటిష్ఠ పరుస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో తయారవుతున్న చేనేత ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని తెలిపారు.

  • Loading...

More Telugu News