team india: బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టిన వసీం అక్రమ్
- టీమిండియా ఆటగాళ్ల వార్షిక వేతనాన్ని సవరించిన బీసీసీఐ పాలకమండలి
- ఐదుగురు ఆటగాళ్లను ఏ ప్లస్ కేటగిరీలో చేర్చిన బీసీసీఐ పాలకమండలి
- ఏప్లస్ కేటగిరీపై బీసీసీఐ పాలకమండలి నిర్ణయాన్ని తప్పు పట్టిన వసీం అక్రమ్
టీమిండియా క్రికెటర్ల వార్షిక వేతన కాంట్రాక్ట్ ను పునరుద్ధరిస్తూ బీసీసీఐ భారీగా వేతనాలు పెంచిన సంగతి తెలిసిందే. ఏ ప్లస్ గ్రేడ్ లో ఐదుగురు ఆటగాళ్లకు స్ధానం కల్పించిన బీసీసీఐ పాలకమండలి, వారికి ఏడాదికి ఏడు కోట్ల వేతనం ఇస్తామని ప్రకటించింది. దీనిపై పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ ఆసక్తికర అభిప్రాయం వెల్లడించాడు. ధావన్, రోహిత్ లకు ఈ జాబితాలో స్థానం కల్పించడం పట్ల పెదవి విరిచాడు. బీసీసీఐ నిర్ణయం సరైనది కాదని పేర్కొన్నాడు.
టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను కాదని, పరిమిత ఓవర్ల క్రికెట్ కు పరిమితమైన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కు చోటు కల్పించడం సరికాదని అన్నాడు. టెస్ట్ క్రికెట్ ద్వారానే ఆటగాళ్లలో అత్యుత్తమ ప్రతిభ బయటపడుతుందని చెప్పిన అక్రమ్, అందులో నిరూపించుకోని ఆటగాళ్లను ఏ ప్లస్ జాబితాలో చేర్చడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్ చాలా కఠినమైనదని, అక్కడ నిరూపించుకున్న ఆటగాడు ఎక్కడైనా నిరూపించుకోగలడని, వారికే ఎక్కువ పారితోషికం అందించాలని అక్రమ్ స్పష్టం చేశాడు. అక్రమ్ అభిప్రాయంపై క్రికెట్ లో చర్చ జరుగుతోంది.