Mumbai: 50 వేల మంది రైతులు నడుస్తూ ముంబై చేరుకున్న వేళ... ఫడ్నవీస్ సర్కారులో ఆందోళన!
- డిమాండ్లను తీర్చాలని కదం తొక్కిన రైతులు
- నడుస్తూ మహానగరం మధ్యకు చేరుకున్న రైతులు
- భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు
- అసెంబ్లీ దిగ్బంధానికి కదులుతున్న ఆందోళనకారులు
సుమారు 50 వేల మంది రైతులు, తమ కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తూ, పాదయాత్రగా ముంబై చేరుకోవడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో పడింది ఫడ్నవీస్ సర్కారు. అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో పంట రుణాల మాఫీ ప్రధాన డిమాండ్ గా, గిట్టుబాటు ధర కల్పించాలని, పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఎరువులు, పురుగుమందులను సబ్సిడీకి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ, వేలాది మంది రైతులు నేడు విధానసభ ముట్టడికి నగరం చేరుకున్నారు. ఇప్పటికే ముంబై మహా నగరాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వైపు దారితీసే మార్గాల్లో ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు. రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తామని ఫడ్నవీస్ ప్రకటించారు. రైతుల ఆందోళనకు మహారాష్ట్ర విపక్షాలు, శివసేన తదితర పార్టీలు మద్దతు ప్రకటించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.