Andhra Pradesh: కాన్ఫిడెన్స్ ఉంటే 'నో కాన్ఫిడెన్స్' ఎందుకు?: చంద్రబాబు సూటి ప్రశ్న
- మోదీ ప్రభుత్వంపై నమ్మకం ఉంటే రాజీనామాలు ఎందుకు?
- వైఎస్ జగన్ కు చంద్రబాబు సూటి ప్రశ్న
- ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై నమ్మకం ఉంటే, ఇక రాజీనామాలు చేయడం ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ ఉదయం ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, పార్లమెంట్ వేదికగా నేడు చేపట్టాల్సిన నిరసనలు, కేంద్రంపై ఒత్తిడి ఎలా పెంచాలన్న అంశాలపై చర్చించారు. నరేంద్ర మోదీ ప్రత్యేక హోదాను ఇస్తారన్న నమ్మకం తమకు ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించడాన్ని గుర్తు చేసిన చంద్రబాబు, ఆయనపై అంత విశ్వాసం ఉంటే ఇక అవిశ్వాసం పెట్టడం ఎందుకని అడిగారు. కాన్ఫిడెన్స్ ఉన్న చోట నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎందుకంటూ ఎద్దేవా చేసిన చంద్రబాబు, ఓ వైపు విశ్వాసం, మరోవైపు అవిశ్వాసం అంటూ డొంకతిరుగుడు మాటలెందుకని ధ్వజమెత్తారు. హోదా విషయంలో టీడీపీ వైఖరి సుస్పష్టమని, రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు వెల్లడించారు. ప్రజల మనోగతాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రంపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని పార్లమెంట్ సభ్యులకు ఆయన సూచించారు. రాష్ట్ర ప్రజల గొంతుకను జాతీయ స్థాయిలో మరింత సమర్థవంతంగా వినిపించాలని దిశానిర్దేశం చేశారు.