TRS: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కేసీఆర్

  • ముగిసిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం
  • జోగినపల్లి సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ ముదిరాజ్ కు అవకాశం
  • రేపు నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్ లో ఈ రోజు నిర్వహించిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొంచెం సేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఆయన అధికారికంగా ప్రకటించారు. జోగినపల్లి సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్ (నల్లగొండ), బండ ప్రకాశ్ ముదిరాజ్ (వరంగల్) పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులు రేపు నామినేషన్లు వేయనున్నట్లు సమాచారం. రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు. కాగా, రేపటి నుంచి ప్రారంభం కాబోయే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం చేశారు.

కాగా, కేసీఆర్ తోడల్లుడు రవీందర్ రావు కుమారుడు సంతోష్ కుమార్. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్ కు జోగినపల్లి సంతోష్ కుమార్ సన్నిహితంగా ఉన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా, టీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఆయన, పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

2009లో టీడీపీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా లింగయ్య యాదవ్ పోటీ చేసి ఓడారు. 2015లో టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయనకు యాదవుల కోటాలో రాజ్యసభ సీటు దక్కింది.

  • Loading...

More Telugu News