Uttar Pradesh: యూపీలో వైద్యుల నిర్వాకం...రోగికి తెగిపడిన కాలునే తలగడగా పెట్టిన వైనం...!
- స్థానిక టీవీ ఛానల్ ప్రసారంతో వెలుగులోకి వచ్చిన ఘటన
- ఘటనపై రెండు రకాల వాదనలు తెరపైకి
- నిజానిజాల నిగ్గు తేల్చేందుకు దర్యాప్తుకు ఆదేశించామన్న ఆసుపత్రి యాజమాన్యం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వైద్య సేవలు ఎంత అధ్వానంగా ఉన్నాయో చెప్పడానికి ఈ సంఘటనో ప్రత్యక్ష నిదర్శనం. ఝాన్సీలోని ప్రభుత్వ వైద్య కళాశాల వైద్యులు తొలగించిన కాలిని రోగికి దిండుగా అమర్చారు. ఓ స్థానిక టీవీ ఛానల్ ఈ దృశ్యాలను ప్రసారం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే, మహారాణి ఝాన్సీ లక్ష్మీభాయి వైద్య కళాశాలలో పనిచేసే వైద్యులు రోగికి దన్నుగా ఉండటం కోసం తొలగించిన కాలును అతని తల కింద దిండులాగా ఉంచారు. స్కూల్ బస్సు క్లీనర్‌గా పనిచేసే బాధితుడు ఝాన్సీ జిల్లాలోని మౌరాణిపూర్ ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యాడు. హుటాహుటిన అతన్ని ఝాన్సీ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఇన్‌ఫెక్షన్ సోకకుండా వైద్యులు అతని కాలును తొలగించారు.
రోగి కాలును అతనికి తలగడగా ఉంచామంటూ తమపై వస్తున్న ఆరోపణలను ఆసుపత్రి వైద్యులు తోసిపుచ్చుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సాధన కౌషిక్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు విరిగిపోయిన బాధితుడి కాలును అతని కుటుంబసభ్యులే ఆసుపత్రికి తీసుకొచ్చారని కొందరు చెబుతుండగా...మరికొందరేమో అతని కాలును వైద్యులే తొలగించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో నిజానిజాల నిగ్గుతేల్చేందుకు ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటిండెంట్ డాక్టర్ హరిశ్చంద్ర ఆర్య తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల ఆసుపత్రుల్లో స్వీపర్లు, వార్డు బాయ్‌లు రోగులకు చికత్స చేస్తున్నారని, చివరకు చిన్న చిన్న సర్జరీలు కూడా వారే చేస్తున్నారన్న వార్తల నడుమ ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.