google maps: గూగుల్ మ్యాప్స్ లో దారి చూపించే సూపర్ మారియో.. రేపటి నుంచి అందుబాటులోకి..
- నావిగేషన్లో బాణం గుర్తుకు బదులుగా మారియో కార్ట్
- ఇక దారి చూసుకుంటూ వెళ్లడం మరింత ఫన్నీ
- గూగుల్ మ్యాప్స్ యాప్ అప్ డేట్ చేసుకోవాలని సూచించిన కంపెనీ
సూపర్ మారియో గేమ్ గుర్తుందా? ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు వచ్చాక కొత్త కొత్త గేమ్స్ వచ్చాయిగానీ.. కొంచెం ముందు తరం వారికి మాత్రం మారియోనే సూపర్ హీరో. మారియో వీడియో గేమ్ చాలా పాపులర్. ఇప్పుడా మారియో మనకు గూగుల్ మ్యాప్స్ లో దారి చూపించనున్నాడు. మనం ఎక్కడికైనా వెళ్లాలంటే.. గూగుల్ మ్యాప్స్ లో దారి చూసుకుని వెళుతుంటాం. నావిగేషన్ ఆన్ చేసుకున్నప్పుడు మనం వెళుతున్న కొద్దీ ఓ బాణం గుర్తు కదులుతూ ఉంటుంది కదా. ఇదే ఇక ముందు మరింత ఫన్నీగా ఉండేందుకు గూగుల్ మ్యాప్స్ సరికొత్తగా ‘మారియో కార్ట్’ను తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ లో బాణం గుర్తుకు బదులుగా.. బండిపై వెళుతున్న మారియో బొమ్మ కనిపించనుంది.
గూగుల్ మ్యాప్స్ లో మారియోను అందించేందుకు జపాన్ వీడియోగేమ్ కంపెనీ నింటెండోతో ఒప్పందం చేసుకున్నట్లు గూగుల్ మ్యాప్స్ యూజర్ ఎక్స్ పీరియెన్స్ ఇంజనీర్ మునీశ్ దబాస్ వెల్లడించారు. ఈ సదుపాయాన్ని పొందడానికి ముందుగా గూగుల్ మ్యాప్స్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. తర్వాత గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేస్తే.. కింద కుడివైపున ప్రశ్నార్థకం (?) ఐకాన్ కనిపిస్తుందని.. దానిపై టాప్ చేస్తే.. మారియో టైమ్ ను ఎనేబుల్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని వెల్లడించారు. భారతదేశంలో మార్చి 12వ తేదీ నుంచి.. అంటే సోమవారం నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.