None of the above (NOTA): ఐదేళ్లలో 'నోటా' మీటను ఎందరు నొక్కారో తెలుసా..?
- ఇప్పటివరకు నోటా మీట నొక్కిన ఓటర్లు 1.33 కోట్ల మంది
- దేశ ఎన్నికల్లో 2013 నుంచి నోటా ఆప్షన్ అందుబాటులోకి
- రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నోటా దక్కించుకున్న ఓట్లు 2.70 లక్షలు
భారతదేశ ఎన్నికల్లో విప్లవాత్మక మార్పుగా భావించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు)పై ఏర్పాటు చేసిన 'నన్ ఆఫ్ ది ఎబౌవ్ (నోటా)' ఆప్షన్‌ను గత ఐదేళ్ల కాలంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎంతమంది ఎంచుకున్నారన్న దానిపై అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) ఓ నివేదికను విడుదల చేశాయి. దాని ప్రకారం, 2013 నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నోటా మీటను 1.33 కోట్ల మంది నొక్కారు. అంటే, సగటున రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నోటా దక్కించుకున్న ఓట్లు 2.70 లక్షలన్నమాట. గోవా, ఢిల్లీలోని ఎన్‌సీటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ఎన్నికల్లో ఓటర్లు అత్యధిక సంఖ్యలో నోటా ఆప్షన్‌కే మొగ్గు చూపారు. తద్వారా సంబంధిత నియోజకవర్గాల్లో నోటా ఓట్ల శాతం మూడు లేదా నాలుగో స్థానాన్ని ఆక్రమించింది.
2017లో గోవాలోని పనాజీ, వాల్పోయి నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వరుసగా 301 (1.94 శాతం), 458 (1.99శాతం) ఓట్లతో నోటా మూడో స్థానంలో నిలిచింది. కాగా, 2014లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికలకు నోటా ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో నోటాకి దక్కిన మొత్తం ఓట్లు 60,02,942. తమిళనాడులోని నీలగిరి లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 46,559 నోటా ఓట్లు వచ్చాయి. నోటా ఓట్లు అత్యల్పంగా లక్షద్వీప్ (123)లో నమోదయ్యాయి. ఇక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే, ఈ ఆప్షన్‌ను తొలుత ఛత్తీస్‌గఢ్, మిజోరాం, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేశారు. 2015లో అత్యధిక శాతం అంటే 2.08 శాతం (9,83,176 ఓట్లు) నోటా ఓట్లు పోల్ అయ్యాయి. బీహార్ (9,47,279), ఎన్‌సీటీ ఢిల్లీ (35,897) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు నోటాకి ఎక్కువగా మొగ్గు చూపారు.