Mandarin: 'మాండరిన్' భాషపై పట్టుకు భారత జవాన్ల కసరత్తు...చైనా వెన్నులో వణుకు...!
- భారత సైన్యం 'మాండరిన్' నేర్చుకుంటే తమ ప్రయోజనాలకు దెబ్బని చైనా భావన
- ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాలపై పట్టు సాధిస్తారేమోనన్న భయం
- తమ సైన్యానికి హిందీ భాష అవసరమని ఛైనా అధికారుల సిఫారసు
భారత జవాన్లు తమ 'మాండరిన్' భాషను నేర్చుకోవడం చైనా వెన్నులో వణుకు పుట్టిస్తున్నట్లుంది. తమ భాషపై భారత సైన్యం పట్టు సాధిస్తే అది తమకు నష్టమేనన్న భావనను ఆ దేశ భద్రతా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. భాషా నైపుణ్యం వల్ల ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో ఏవైనా ఘర్షణలు లేదా స్వల్ప యుద్ధాలు సంభవిస్తే భారత జవాన్లు పైచేయి సాధిస్తారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 25 మంది సభ్యులతో కూడిన భారత జవాన్లు, ఐటీబీపీ అధికారుల బృందం మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఉన్న సాంచీ యూనివర్శిటీ ఆఫ్ బుద్దిస్ట్ -ఇండో స్టడీస్‌లో చైనా భాషకు సంబంధించిన ఏడాది కోర్సును నేర్చుకోనున్నట్లు గతనెలలో పీటీఐ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.
భారత జవాన్లు మాండరిన్ భాషను నేర్చుకోవడం వల్ల ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో అపార్థాలను తగ్గించవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కానీ, చైనాకి చెందిన పలువురు భద్రతా అధికారులు మాత్రం ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారు. శాంతి కోరుకునే సమయంలో భారత జవాన్ల చైనా భాషా సామర్థ్యం ఇరు వర్గాల మధ్య చక్కటి సంభాషణలకు అవకాశం కల్పిస్తుందని, అదే యుద్ధ సమయంలో అదే భాష ఆయుధంలా మారి పరిస్థితులను మరింత జటిలం చేయవచ్చనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో చైనా సైనిక నిపుణుడు సోంగ్ ఝోంగ్‌పింగ్ మరో అడుగు ముందుకేసి, ఘర్షణల సమయంలోనే కాక ప్రశాంత పరిస్థితుల్లోనూ సరిహద్దు ప్రాంతాలపై భారత్ పట్టు సాధించవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సైనికులు కూడా హిందీ భాషను నేర్చుకోవాలని పలువురు చైనా సైనికాధికారులు గతంలో సూచించడం గమనార్హం.