Election Commission: విడ్డూరం...గోరఖ్ పూర్‌ ఉప ఎన్నికల్లో విరాట్ కోహ్లీకి ఓటు హక్కు..?!

  • రేపు గోరఖ్ పూర్ లోక్‌సభకు ఉప ఎన్నికలు
  • షాజన్వా అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్ల జాబితాలో కోహ్లీ పేరు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వైనం
  • దర్యాప్తుకు ఆదేశం, బాధ్యులపై చర్యలకు హామీ

ఢిల్లీకి చెందిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రేపు జరగనున్న గోరఖ్ పూర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హుడా?! అని అంటే అర్హుడే అని బదులివ్వాల్సి ఉంటుంది. అందుకు కారణం, అతని పేరుపై ఎన్నికల సంఘం అధికారులు ఓటరు చీటీని జారీ చేయడమే. కోహ్లీ ఫొటోతో జారీ చేసిన ఓటరు స్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై యూపీ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి రత్నేశ్ సింగ్ విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

బూత్ స్థాయి అధికారి సునీతా చౌబే దీనిపై మాట్లాడుతూ...లోక్‌సభ పరిధిలోని షాజన్వా అసెంబ్లీ సెగ్మెంట్‌కి సంబంధించిన ఓటర్ల జాబితాలో 822 నెంబరుతో కోహ్లీ పేరిట ఓ ఓటరు స్లిప్ జారీ కావడం గుర్తించి, ఎన్నికల అధికారులకు సమాచారం అందించినట్లు ఆమె చెప్పారు. ఈ ఘటన తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆమె అన్నారు. కోహ్లీ పేరును ఓటరుగా చేర్చడానికి సంబంధించి షాజాన్వా అసెంబ్లీ నియోజకవర్గం ఎస్‌డీఎం, తహశీల్దారులను ప్రశ్నించామని, ఓటర్ల జాబితాలో మరికొన్ని లోపాలు కూడా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై దర్యాప్తుకు ఆదేశించామని గోరఖ్‌పూర్ డీఎం రాజీవ్ రౌతెలా తెలిపారు.

  • Loading...

More Telugu News