YSRCP: బీజేపీతో కలిసి నడుస్తాం.. తేల్చేసిన వైసీపీ!
- బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తుంది
- మోదీపై మాకు అచంచల విశ్వాసం ఉంది
- కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వబోం.. ఆ పార్టీపై నమ్మకం లేదు
- జాతీయ చానల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
బీజేపీపై తన వైఖరేంటో వైఎస్సార్ కాంగ్రెస్ చెప్పేసింది. తమ మద్దతు బీజేపీకేనని, తాము ఆ పార్టీతోనే ఉంటామని చెప్పకనే చెప్పింది. ఇలా అంటూనే విచిత్రంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతోంది. ప్రధాని మోదీపై తమకు అపార విశ్వాసం ఉందని అంటూనే ప్రభుత్వంపై మాత్రం అవిశ్వాసం పెట్టి తీరుతామని చెబుతోంది. జాతీయ న్యూస్ చానల్ ‘ఇండియా టుడే’లో సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉందని, ఏపీకి హోదా ఇచ్చే వారికే మద్దతు ఇస్తామని పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది కదా, మరి ఆ పార్టీతో కలుస్తారా? అన్న రాజ్‌దీప్ వ్యాఖ్యలను విజయసాయి కొట్టిపడేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, కాబట్టి ఆ పార్టీని నమ్మలేమని పేర్కొన్నారు. బీజేపీ మాత్రమే హోదా ఇవ్వగలదని, మోదీ తమ డిమాండ్‌ను అంగీకరిస్తారన్న నమ్మకం ఉందని ఎంపీ వివరించారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంటే ఆ పార్టీతో వైసీపీ జత కడుతుందా? అన్న ప్రశ్నకు విజయసాయి మాట్లాడుతూ.. హోదా ఇస్తామన్న వారితో కలిసి నడవడమే తమ విధానమని, ఈ విషయాన్ని జగన్ స్పష్టంగా పేర్కొన్నారని స్పష్టం చేశారు. కాగా, మోదీపై అంత విశ్వాసం ఉన్నప్పుడు ఆయన సర్కారుపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడుతున్నారంటూ ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.