Chandrababu: మోదీకి చంద్రబాబు ఫోన్‌ చేశారా.. చంద్రబాబుకి మోదీ చేశారా?: బొత్స సత్యనారాయణ డౌట్

  • నిన్న ప్రధానమంత్రి ఫోన్ చేశారని చంద్రబాబు చెప్పారు
  • ప్రత్యేక హోదా ఇవ్వనందుకే రాజీనామా చేస్తున్నామని మోదీకి చంద్రబాబు చెప్పలేకపోయారు
  • ప్రధానితో మీరు ఏం మాట్లాడారు?
  • ఐదు కోట్ల మంది ఆకాంక్షలని నెరవేర్చాలని ఎందుకు అడగలేకపోయారు?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'నిన్న తనకు ప్రధానమంత్రి ఫోన్ చేశారని చంద్రబాబు చెప్పారు. అసలు ఆయన ఈయనకు ఫోన్ చేశారో.. ఈయన ఆయనకు ఫోన్ చేశారో మనకు తెలియదు.. కానీ, ప్రత్యేక హోదా ఇవ్వనందుకే రాజీనామా చేస్తున్నామని మోదీకి చంద్రబాబు చెప్పలేకపోయారు.. ప్రధానమంత్రితో మీరు ఏం మాట్లాడారు.. ప్రత్యేక హోదా కావాలని, ఐదు కోట్ల మంది ఆకాంక్షని నెరవేర్చాలని ఎందుకు అడగలేకపోయారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రయోజనాలను నాలుగేళ్లుగా ఎందుకు సాధించుకోలేకపోయారు' అని ప్రశ్నించారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాడుతూ తాము అవిశ్వాస తీర్మానం పెడతామని బొత్స అన్నారు. జైట్లీ గతంలో ఏది చెప్పారో మళ్లీ అదే చెప్పారని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీడీపీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టాల పాలయిందో దేశం మొత్తానికి తెలియజెప్పడానికే అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని అన్నారు.  

  • Loading...

More Telugu News