Hyderabad: మిలియన్ మార్చ్ సంస్మరణ దినోత్సవానికి అనుమతి నిరాకరణ
- అనుమతి కోరిన రాజకీయ జేఏసీ
- గతంలో మార్చ్ వల్ల ఘర్షణలు జరిగాయన్న పోలీసులు
- భద్రతా సమస్యల వల్ల అనుమతి నిరాకరణ
మిలియన్ మార్చ్ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించాలన్న రాజకీయ జేఏసీ నిర్ణయానికి అనుమతి నిరాకరణ రూపంలో బ్రేక్ పడింది. ఈ నెల 10న (రేపు) హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై గతంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ ను గుర్తు చేసుకుంటూ సంస్మరణ దినోత్సవం జరపాలని రాజకీయ జేఏసీ, విద్యార్థి, ప్రజా సంఘాలు భావించాయి. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పై ఆట, పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతి కావాలంటూ సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేరుతో ఈ నెల 2న పోలీసులకు దరఖాస్తు చేశారు.
అయితే గతంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ వల్ల ఘర్షణలు చెలరేగి, పలువురు గాయపడిన ఘటనలు చోటు చేసుకున్నాయని, ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతే కాకుండా మిలియన్ మార్చ్ లో ఎంతమంది పాల్గొంటారు? ఎవరెవరు మాట్లాడతారు? వంటి వివరాలేవీ దరఖాస్తు దారు తెలుపలేదని అన్నారు. ఆ వివరాలు తెలియకుండా అనుమతినివ్వడం సరికాదని అన్నారు. అంతే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సమయంలో సంఘ విద్రోహ శక్తులు చొరబడే వీలుందని, దీంతో అనుమతి నిరాకరిస్తున్నామని డీసీపీ స్పష్టం చేశారు.