South Korea: అసాధారణ పరిణామం... కిమ్ జాంగ్ ఉన్ తో సమావేశానికి డొనాల్డ్ ట్రంప్ అంగీకారం
- మే నెలలోగా ఇరు నేతల భేటీ
- నేతలిద్దరూ ఆసక్తిగా ఉన్నారు
- సౌత్ కొరియా జాతీయ భద్రతా సలహాదారు వెల్లడి
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ను కలిసి చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఉత్తర కొరియా అణు పరీక్షలు, ఆపై అమెరికా ఆంక్షలు పెట్టడం, నేతల మధ్య మాటల తూటాలు... ఇలా ఎన్నో నెలల పాటు రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు తొలగేందుకు ఇది ఎంతో సహకరిస్తుందని వైట్ హౌస్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సౌత్ కొరియా జాతీయ భద్రతా సలహాదారు చుంగ్ ఈ యాంగ్, శ్వేతసౌధంలో అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, అణు పరీక్షలకు, క్షిపణి ప్రయోగాలను ఆపేందుకు, సౌత్ కొరియాతో కలసి సంయుక్త సైనిక విన్యాసాలు చేసేందుకు కిమ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
వింటర్ ఒలింపిక్స్ తరువాత ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణం చల్లబడగా, గడచిన సోమవారం నాడు పాంగ్ యాంగ్ లో కిమ్ తో చుంగ్ ఈ యాంగ్ నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు. ఆ వివరాలను అగ్రరాజ్యానికి వివరించిన ఆయన, మే నెలలోగా ట్రంప్, కిమ్ భేటీ ఉంటుందని, అందుకు ట్రంప్ సైతం అంగీకరించారని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరలో ట్రంప్ ను కలుసుకోవాలని కిమ్ కూడా భావిస్తున్నారని, వీరి భేటీ చారిత్రాత్మకమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.