Xiaomi: రెడ్‌మీ నోట్ 5 వినియోగదారులకు షాక్.. సీవోడీ ఆప్షన్‌ను ఎత్తేసిన షియోమీ
- రిటైలర్లు తిరిగి అధిక ధరకు విక్రయిస్తున్నట్టు ఆరోపణ
- ఫ్లిప్‌కార్ట్, షియోమీ అధికారిక వెబ్‌సైట్ల నుంచి సీవోడీ ఆప్షన్ ఎత్తివేత
- ఫోన్లు కొనుగోలు చేయాలంటే ముందే డబ్బు చెల్లించాల్సిందే
చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ తాజాగా విడుదల చేసిన రెడ్‌మీ నోట్ 5 ప్రొ క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) ఆఫ్షన్‌ను తొలగించింది. రిటైలర్లు వీటిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు తిరిగి విక్రయిస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 7న నిర్వహించిన ఫ్లాష్ సేల్‌లో ఈ ఆప్షన్ లేకుండానే ఫోన్లను విక్రయించింది. స్మార్ట్‌ఫోన్ రీ సెల్లింగ్‌ను నియంత్రించేందుకే ఈ సీవోడీ ఆప్షన్‌ను తొలగించినట్టు షియోమీ పేర్కొంది.
ఫిబ్రవరిలో రెడ్‌మీ నోట్ 5 ఫోన్లకు నిర్వహించిన ఫ్లాష్ సేల్‌లో అనూహ్య స్పందన వచ్చింది. కేవలం మూడు నిమిషాల్లోనే మూడు లక్షల స్మార్ట్‌ఫోన్లను విక్రయించింది. అయితే ఇలా విక్రయించిన వాటిలో ఎక్కువ శాతం ఫోన్లను రిటైలర్లు కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకుని తర్వాత వాటిని అధిక ధరకు విక్రయిస్తున్నట్టు తేలింది. దీంతో సీవోడీ ఆప్షన్‌ను ఎత్తివేసిన షియోమీ ఇకపై ఈ అవకాశం ఉండబోదని స్పష్టం చేసింది. ఫ్లిప్‌కార్ట్, షియోమీ అధికారిక వెబ్‌సైట్లలో ఈ ఆప్షన్ లభించదని తేల్చి చెప్పింది.
రెడ్ మీ నోట్ 5 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ ధర రూ.11,999. నోట్ 5 ప్రొ 4జీబీ ర్యామ్, 64 జీబీ మొబైల్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ వేరియంట్ ధర రూ.16,999 గా షియోమీ పేర్కొంది.